అనంతగిరి: అభ్యాసనలో అసమానతలు తొలగించి సైన్‌పై ఆసక్తి పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లాలో ట్రాన్స్‌ఫార్మ్ స్కూల్స్ – పీపుల్ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో క్వాల్‌కం సహకారంతో లర్నింగ్ ఇక్వూలైజర్ విత్ సైన్స్ క్యాపిటల్ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్స్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొడంగల్ ప్రాంతంలోని 25 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అందించే విద్యా వనరులు, అభ్యసన అవకాశాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ అభ్యసన సామర్థ్యాలు, శాసీ్త్రయ ఆలోచన విధానం, స్టెం నైపుణ్యాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలు ఎంతో కీలకమని తెలిపారు,. విద్యార్థుల లర్నింగ్ అవుట్ కమ్స్‌పై నిరంతరం సమీక్ష నిర్వహిస్తూ పాఠశాలలకు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు, సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బస్వరాజు గుట్టుర్, అకడమిక్ మానిటరింగ్ అధికారి మస్తాన్, సంస్థ ప్రతినిధులు సుధీర్, హనిఫ్ పైల్వాల్, రఫీ, ప్రవీణ్‌కుమార్, 25 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు టీచర్లు పాల్గొన్నారు.
కార్యక్రమ లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడం, సైన్స్, స్టెమ్ పట్ల ఆసక్తిని పెంచడం, శాసీ్త్రయ ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నైపుణ్యాలను పెపొందించడం తోపాటు ఉపాధ్యాయులకు ఆధునిక విద్యార్థి కేంద్రిత బోధన పద్ధతులపై నిరంతరం సహకారం అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. సబ్జెక్టు నిపుణుల ఆధ్వర్యంలో సబ్జెక్టు టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గణితం, సైన్స్, తెలుగు, ఇంగ్లిష్ అంశాల్లో బోధన నైపుణ్యాల అభివృద్ధి, స్టెమ్ ధారిత బోధనా విధానాలు, విద్యార్థి కేంద్రిత అభ్యసన పద్ధతులు, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే వ్యూహాలపై శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని 25 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాలను పెంపొందించడం, విద్యార్థుల్లో సైన్స్, స్టెమ్ అభ్యసనంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది.
వంద శాతం సబ్సిడీతో కుట్టుమిషన్లు
బీసీ మహిళలకు వంద శాతం సబ్సిడీతో ఆటోమెటిక్ కుట్టుమిషన్లు పంపిణీ చేయనున్నట్లు, అర్హులైన వారు ఆన్‌లైన్‌లో టీజీవోమీఎంఎంఎస్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ దీపక్ తివారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులన్నారు. 18 – 55 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు మించరాదన్నారు. కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగిన వారికి, కనీస ప్రాథమిక అక్షరాస్యత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సెప్టెంబర్ 15లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మిషన్లు(రూ.12 వేల యూనిట్ వ్యయంతో) ఉచితంగాపంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన బీసీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలోని 25 పాఠశాలల్లో అమలు
కలెక్టర్ దీపక్ తివారి
విద్యార్థులు, ఉపాధ్యాయుల
హ్యాండ్ బుక్స్ ఆవిష్కరణ


