21 వరకు రైల్వే గేట్‌ మూత | - | Sakshi
Sakshi News home page

21 వరకు రైల్వే గేట్‌ మూత

Aug 19 2026 9:10 AM | Updated on Aug 19 2026 9:10 AM

నవాబుపేట: రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగా గొల్లగూడ రైల్వే గేట్‌ ఈ నెల 21 వరకు మూసి ఉంటుందని వికారాబాద్‌ రైల్వే సెక్షన్‌ ఇంజనీర్‌ శ్యామ్‌ శేఖర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ఈ నెల 17వరకు మూసి ఉంచనట్లు తెలపినా పనుల ఆలస్యం కారణంగా ఈ నెల 21వరకు పొడిగించామన్నారు. ప్రయాణికులు, వాహనదారులు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించాలని సూచించారు.

గంజాయి విక్రేతలకు రిమాండ్‌

1.1 కేజీలు సీజ్‌

పరిగి: ముగ్గురు గంజాయి విక్రేతలను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన మండల పట్టణ కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. పరిగి సీఐ కొండల్‌ రెడ్డి, ఎస్‌ఐ మోహన్‌కృష్ణ తెలిపిన ప్రకారం.. పట్టణ కేంద్రంలోని జింఖాన గ్రౌండ్‌లో గంజాయి సేవించి విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. బిహార్‌కు చెందిన తన్వీర్‌ అహ్మద్‌ పరిగిలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. బిహార్‌ నుంచి గంజాయి తీసుకువస్తున్న తన్వీర్‌ అహ్మద్‌ పట్టణ కేంద్రానికి చెందిన మహ్మద్‌ ఉమర్‌, అబ్దుల్‌ కలీంకు తక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం వారు ముగ్గురూ స్కూటీపై గ్రౌండ్‌కు వచ్చారు. వారి వద్ద ఉన్న బ్యాగు నుంచి గంజాయి తీస్తుండగా అక్కడే కాపుకాసిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడిపై కేసు

తాండూరు టౌన్‌: తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నాయకుడు అనిల్‌ బాండ్‌పై పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. పట్టణ సీఐ పరమేశ్వర్‌ గౌడ్‌ తెలిపిన ప్రకారం.. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ఐదు నెలల తర్వాత సోమవారం తాండూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అనిల్‌బాండ్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అతని సోదరుడు శ్రీనివాస్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అతనితోపాటు సహచరులపై కాంగ్రెస్‌ నాయకులు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చికిత్స పొందుతూ

వృద్ధుడి మృతి

పూడూరు: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరుకు చెందిన గొల్ల అంతయ్య(80) ఈ నెల 17వ తేదీ రాత్రి పరిగి నుంచి పూడూరుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. పూడూరు గేటు వద్ద బస్సు దిగుతుండగా డ్రైవర్‌ బస్సును అజాగ్రత్తగా నడపడంతో కింద పడిపోయాడు. అంతయ్య కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి గాయాలు

కుల్కచర్ల: గుర్తు తెలియని వాహనం ఢీ కొని యువకుడికి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం కుల్కచర్ల మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌కు చెందిన వార్ల గోపాల్‌ గౌడ్‌ మధ్యాహ్న ఘణపూర్‌ గేట్‌ నుంచి కుల్కచర్లకు వస్తుండగా మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని మహబూబ్‌నగర్‌కు అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వ్యక్తి అదృశ్యం

మొయినాబాద్‌ రూరల్‌: భార్యతో గొడవపడి ఓ వ్యక్తి ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయిన సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందని యాతం నర్సింహులు(52) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆయన తన భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు బంధువులు, తెలిసిన వారి వద్ద వాకబు చేయగా ఆచుకీ లభ్యం కాలేదు. దీంతో నర్సింహులు కుమారుడు నరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement