తాండూరు: శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డికి తాండూరులో తొలిసారి స్థల వివాదం ఎదురైంది. పట్టణ శివారు కోకట్ రోడ్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ భర్త బాల్‌రెడ్డికి వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలోని రెండెకరాలను 2020లో మహేందర్‌రెడ్డి కొనుగోలు చేశారు. అప్పట్లో చైర్‌పర్సన్ దంపతులు ఆయనకు అనుచరులుగా ఉన్నారు. అయితే రాజకీయ సమీకరణలు మారడంతో ప్రస్తుతం వారు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వర్గంలో చేరి, మున్సిపల్ ఎన్నికల్లో నీరజ చైర్‌పర్సన్‌గా గెలిచారు. ఇటీవల పట్నం మహేందర్‌రెడ్డి ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి సన్నాహాలు చేశారు. కోకట్ రోడ్డు నుంచి బైపాస్ వరకు సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరవడంతో రెండు నెలలుగా పనులు జరుగుతున్నాయి. కానీ మున్సిపల్ చైర్‌పర్సన్ తమ భూమిని రోడ్డుకు వదలకపోవడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఈ విషయంపై ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లిన మహేందర్‌రెడ్డి అక్కడ చర్చలు జరిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవిగౌడ్, కాంగ్రెస్ నాయకుడు అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నా పరిష్కారం కుదరలేదు.
700 గజాలు వదిలిన నర్సింహులు..
అనంతరం మున్సిపల్ కౌన్సిల్ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప భర్త నర్సింహులుతో డాక్టర్ సంపత్‌కుమార్, పట్నం మహేందర్‌రెడ్డి చర్చించారు. సీసీ రోడ్డు కోసం తన భూమిలో 700 చదరపు గజాలు వదులుతానని నర్సింహులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.
సోషల్ మీడియాలో మరో ప్రచారం..
భూ సమస్యపై చర్చల కోసం పట్నం మహేందర్‌రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాండూరులోనే ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సోదరుడి ఇంటికి వెళ్లడంతో రాజకీయ చర్చలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అలాగే సోమవారం మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రావడంతో కాంగ్రెస్ నేతల భేటీ అంటూ పుకార్లు వచ్చాయి. అయితే నేతలు వివాదాస్పద స్థలం వద్ద కనిపించడంతో అవన్నీ వదంతులేనని తేలిపోయాయి.
రాజీ కుదర్చాలని శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లిన చీఫ్ విప్
భూ యజమాని బాల్‌రెడ్డిససేమిరా అనడంతో చర్చలు విఫలం


