ఏడాదికోరంగు
వికారాబాద్: మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా విద్యాశాఖ పరిస్థితి తయారైంది. బడులు ఓపెన్ చేసే నాటికే యూనిఫాం, షూ, నోట్‌బుక్స్, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన విద్యాశాఖ నేటికి వాటిని అందిచలేదు. పాఠశాలలు పునఃప్రారంభమై నెల పదిహేను రోజులు గడిచినా ఏకరూప దుస్తులు విద్యార్థులకు అందలేదు. కొందరు విద్యార్థులు ఏదో ఒకటి కుట్టించుకుని వేసుకుని వెళ్తుండగా.. మరికొందరు గతేడాది ఇచ్చిన దుస్తులే వేసుకుంటున్నారు. గతేడాది ఇదే తరహాలో జాప్యం చేస్తూ విద్యా సంవత్సరం చివరి వరకు ఇస్తూ వెళ్లిన అధికారులు ఈ ఏడాది సైతం అదే దోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు దుస్తుల వెతలు తప్పడం లేదు. సర్కారు బడి అయినా.. ప్రైవేటు స్కూల్ అయినా తల్లిదండ్రులకు యునిఫాంల తిప్పలు తప్పటంలేదు. స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు యునిఫాంలు కొనుగోలు చేయక తప్పడంలేదు. ఈ ఏడాది నుంచి నూతన తరహాలో యూనిఫాంలు డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి డిజైన్ చేసిన కలర్లకు అనుగుణంగా ఇటీవలే బట్ట కొనుగోలు చేశారు.
బట్ట పంపిణీ ఆలస్యం
వికారాబాద్ జిల్లాలో మొత్తం 1,063 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 73,861 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరికి విద్యాశాఖ నుంచి ప్రతీ సంవత్సరం రెండు జతలు యునిఫాంలు ఉచితంగా అందజేస్తుంది. పాఠశాలల పునః ప్రారంభానికి ముందే బట్ట పంపిణీ చేసి కుట్టిస్తుంది. వాటికి సంబంధించి మండలాలు పాఠశాలల వారీగా విద్యాశాఖ కూలీ డబ్బులు అందిస్తుంది. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున 1,47,722 దుస్తులు అవసరం కాగా ఇప్పటి వరకు విద్యాశాఖ ఒక జత కూడా అందజేయలేదు. కాగా ఈ ఏడాది స్థానిక మహిళా సంఘాలకు బట్ట పంపిణీ చేసి కుట్టిస్తున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా.. బట్ట పంపిణీలో ఆలస్యం వల్లే కుట్టడం లేట్ అవుతోందని మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. కూలీ డబ్బులు సైతం సకాలంలో చెల్లించకపోవడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. యునిఫాంలు కుట్టించేందుకు 820 స్వయం సహాయక సంఘాలను గుర్తించిన జిల్లా అధికారులు ఇటీవలే వారికి బట్ట అందజేశారు. కేజీబీవీ విద్యార్థులకు మాత్రం యూనిఫాంలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలకు ఇటీవలే షూ చేరినా.. యూనిఫాంలతో పంపిణీ చేయాలని నిర్ణయించి పక్కన పెట్టారు. ఈ ఏడాది నుండి పంపిణీ చేస్తామన్న బ్యాగులు ఇతర వస్తువులపై స్పష్టత కొరవడింది.
బడులు ప్రారంభమై నెలన్నర గడిచినా అందని యూనిఫాంలు
పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు
నాణ్యతలోపం కారణంగా ఒక్కో బడికి ఒక్కోరకం దుస్తులు
తల్లిదండ్రులకు ఆర్థిక భారం
యూనిఫాంల విషయంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే ఉండే యునిఫాంలు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ తప్పనిసరి చేశారు. పంపిణీ చేస్తున్న దుస్తులు ఒక్కో ఏడాది ఒక్కో రంగులో ఉంటున్నాయి. అవి నాణ్యతగా ఉండకపోవడంతో పాఠశాలల ఉపాధ్యాయులు ఆకర్శణీయంగా ఉండే వేరే రంగుల దుస్తులను తమ పాఠశాలలకు యునిఫాంగా పెట్టుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులు యూనిఫాంలు కొనుగోలు చేయకతప్పడం లేదు. ఒక్కో ప్రభుత్వ పాఠశాలకు ఒక్కోరకం దుస్తులు యూనిఫాంలుగా ఉంటున్నాయి.


