● ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఈర్లపల్లి రైతులు
● చట్టం ప్రకారం న్యాయం చేస్తాం: అదనపు కలెక్టర్ వెంకటాచారి
దుద్యాల్: మార్కెట్ విలువ ఆధారంగా భూ పరిహారం చెల్లించాలని ఈర్లపల్లి, నన్యానాయక్ తండా, సంట్రకుంటతండా రైతులు అధికారులను కోరారు. పారిశ్రామిక వాడ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు ఆర్డీఓ అనిత మాట్లాడుతూ.. 146.30 ఎకరాల పట్టాభూములున్న రైతుల వివరాలు, 88 సర్వే నంబర్‌లో 213 ఎకరాలు ఉండగా భూ భారతిలో నమోదైన 95 ఎకరాల రైతుల వివరాలు చదివి వినిపించారు. మిగిలిన 118 ఎకరాల అసైన్డ్ భూములకు సమస్యలున్నాయని చెప్పారు. పొజిషన్‌లో ఉండి పట్టా లేకపోవడం, పట్టా ఉండి పొజిషన్‌లో లేకపోవడం వంటి సమస్యలు గుర్తించామని.. ఎంజాయ్‌మెంట్ సర్వే చేపడితే పూర్తి సమాచారం తెలుస్తుందన్నారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, హకీంపేట్‌లో మాదిరిగా భూములు కోల్పోయే రైతులకు ఇళ్ల స్థలాలు, పారిశ్రామికవాడలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వెంకటాచారి మాట్లాడుతూ.. చట్ట ప్రకారం ప్రతీ రైతుకు న్యాయం చేస్తామని.. ఆందోళన చెందొద్దని సూచించారు. 118 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు రైతులు సహకరించాలని కోరారు. గిరిజనులకు సంబంధించిన అసైన్డ్ భూములు వారికే చెందాలని కోరగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, డీటీ శివకుమార్, ఆర్‌ఐ నవీన్, జీపీఓలు రమేశ్, గోపాల్, పంచాయతీ కార్యదర్శులు కిషన్, సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు మొగులయ్య, మాణిక్యనాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు రవి నాయక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
భారీగా పోలీసు బందోబస్త్
ఈర్లపల్లిలో నిర్వహించిన రైతు ప్రజాభిప్రాయ సేకరణ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ రాజేశ్ మీనా ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి. వికారాబాద్, పరిగి డీఎస్పీలు వీరేశ్, శ్రీనివాస్‌లు భద్రతాఏర్పాట్లను పర్యవేక్షించారు. నలుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.


