కిరాతకుడు | - | Sakshi
Sakshi News home page

కిరాతకుడు

Jul 12 2026 6:52 AM | Updated on Jul 12 2026 6:52 AM

1 కత్తి 2 గంటలు 6 హత్యలు

పోక్సో నిందితుడి రాక్షసత్వం భీతిల్లిన షాబాద్‌, దైవాలగూడ

భార్యాపిల్లలతో పాటు మరో ముగ్గురిని చంపిన ఉన్మాది

పెద్దలు కాదన్నా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత పక్కింటి బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తూ పోక్సో కేసులో నిందితుడయ్యాడు. తనపై కేసు పెట్టిన బాలిక కుటుంబ సభ్యులతో పాటు ఇందుకు సహకరించిందనే కారణంతో కట్టుకున్న భార్యపైనా కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు కొడుకులతో పాటు బాలిక, ఆమె తల్లి, నాయనమ్మను హత్య చేసి, నరమేధం సృష్టించాడు దైవాలగూడకు చెందిన నరరూప రాక్షసుడు రాజ్‌కుమార్‌.

సాక్షి, రంగారెడ్డి జిల్లా/షాబాద్‌/షాద్‌నగర్‌/చేవెళ్ల: పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌ ఉన్మాదిగా మారి మారణహోమం సృష్టించాడు. ఒకే కత్తితో కేవలం రెండు గంటల వ్యవధిలో ఆరుగురిని హత్య చేసి, పరారయ్యాడు. వయసులో తనకన్నా పెద్దదైన సరితను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి, ఆమెకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ పేరుతో పక్కింటి బాలికను వేధించసాగాడు. ఈక్రమంలో అతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కొంతమంది స్థానిక పోలీసులకు మద్యం, డబ్బు ఎరగా వేసి మరింత రెచ్చిపోయాడు.

ప్రభుత్వ వైఫల్యమే..

ప్రభుత్వ వైఫల్యమే హత్యలకు కారణమని మాజీ మంత్రులు పట్లోళ్ల సబితారెడ్ది, సత్యవతి రాథోడ్‌, పద్మాదేవేందర్‌రెడ్డి మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు షాబాద్‌ వెళ్తున్న వీరిని మల్కాపూర్‌ గేట్‌వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంటకు పైగా వాగ్వాదం, తోపులాట జరిగింది. సబితారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వీరి నుంచి తప్పించుకున్న సత్యవతిరాథోడ్‌ షాబాద్‌ చేరుకున్నారు.

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌ మండిపడ్డారు. హత్యల విషయం తెలియడంతో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి షాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. పోక్సో కేసు నమోదైన నిందితుడిని అరెస్టు చేయకపోవడంతోనే ఆరుగురి ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యేకు నిరసన సెగ

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వెళ్లగా బాధితులు ఆయనపై తిరగబడ్డారు. దీంతో చెమటలు తుడుచుకుంటూ బయటకు వచ్చారు.

నిరసనల హోరు

హత్యల నేపథ్యంలో షాబాద్‌లో మృతుల బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

శంకర్‌పల్లి: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నిద్రపోతోందని, సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు షాబాద్‌ బయల్దేరిన నాయకులను చేవెళ్ల వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొన్న బండి సంజయ్‌ కొడుకు కేసులో, ఇప్పుడు షాబాద్‌ కేసులో నిందితులను జనాలపైకి వదిలేశారని మండిపడ్డారు.

పాపం మేఘన

కళ్ల ముందే తల్లి, నానమ్మ, చెల్లిని కోల్పోయిన మేఘన (19) తన వాళ్ల హత్యలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. మద్యానికి బానిసైన తండ్రి మల్లేశ్‌ కొన్నేళ్ల క్రితమే మృతిచెందడంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. పుట్టుకతోనే వైకల్యం కలిగిన మేఘన ఇంటికే పరిమితమైంది. ప్రస్తుతం అందరినీ కోల్పోయి అనాథగా మారింది.

అన్ని కోణాల్లో దర్యాప్తు

హంతకుడు రాజ్‌కుమార్‌ను పట్టుకునే దిశగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం.

నీ మొగున్ని చంపా.. నిన్నూ చంపేస్తా..

హంతకుడు రాజ్‌కుమార్‌ బాలిక తల్లి లక్ష్మిని తరచూ బెదిరించేవాడని తెలుస్తోంది. నీమొగుడిని చంపినట్లే నిన్ను కూడా చంపేస్తానని పలుమార్లు ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. మద్యానికి బానిసైన మల్లేశ్‌ను కూడా రాజ్‌కుమారే హత్యచేసి ఉంటాడని స్థానికులు గుసగుసలాడారు.

సెటిల్మెంట్లకు అడ్డాగా..

షాద్‌నగర్‌ రూరల్‌: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాలు, దొంగతనాలు, దోపిడీలు ఇతర వివాదాలపై వచ్చే ఫిర్యాదులను పక్కన పెట్టి భూ వివాదాలు, సెటిల్మెంట్లపైనే దృష్టి సారించారని ప్రజలు మండిపడుతున్నారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అభ్యర్థించిన వారిని గాలికి వదిలేసి, నేరస్తులు ఇచ్చే డబ్బు తీసుకుని, వారితో దోస్తీ చేస్తున్నారని వాపోతున్నారు. షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందని, దీనికి కూతవేటు దూరంలోనే ముగ్గురిని హత్య చేయడం పోలీసుల పనితీరుకు నిదర్శమని ధ్వజమెత్తారు. రాజ్‌కుమార్‌ నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని బాలిక తల్లి చిట్యాల లక్ష్మి, ఆమె సోదరుడు నరేష్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం చేయడంతోనే ఈ హత్యలు జరిగాయని మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement