తాండూరు రూరల్: కరన్‌కోట్ గ్రామ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఫ్యాక్టరీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కోరారు. శనివారం ఈ మేరకుపరిశ్రమ జనరల్ మేనేజర్ రవీంద్ర సరోజ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్మికులకు కనీస వేతనం, సర్వీసు ఆధారంగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కరన్‌కోట్ సర్పంచ్ రాజ్‌కుమార్, మాజీ ఎంపీపీ శరణు బసప్ప, ఏఐటీయూసీ ప్రతినిధులు వంశీకృష్ణ, శంకర్‌గౌడ్, సురేష్‌రెడ్డి, జంగయ్య, సుధాకర్, చిప్పరాజు తదితరలులు పాల్గొన్నారు.
రేపు ఆలయ భూముల
కౌలు వేలం
దోమ: మండలంలోని గంజిపల్లిలో కొలువుదీరిన హనుమాన్ ఆలయ భూములకు ఈ నెల 13న కౌలు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ బాలనర్సయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ సర్వే నంబర్ 2లో మూడు ఎకరాల 18 గుంటల భూమి ఉందని, అట్టి భూమికి సోమవారం ఉదయం 10.30 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల రైతులు వేలంలో పాల్గొనాలని సూచించారు.
ఆరోగ్యంతోపాటు ఓటూ ముఖ్యమే
జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్
కుల్కచర్ల: ఆరోగ్యంతో పాటు ఓటు హక్కు పొందడం కూడా చాలా ముఖ్యమని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన ఎస్‌ఐఆర్‌పై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. జలుబు, జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. సర్ ప్రక్రియకు గ్రామస్తులు సహకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్‌ఓలకు అందజేయాలని తెలిపారు. ఓటు వజ్రాయుధంలాంటిదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చర్చి ఆస్తులను కాపాడాలి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మెథడిస్తు చర్చి ఆస్తులను కాపాడాలని పలువురు క్రిస్టియన్లు కిష్టఫర్, శ్రీను సుందర్‌రావు, ప్రీతంజయశంకర్, చంద్రశేఖర్ కోరారు. శనివారం చర్చి ఆవరణలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చర్చి ఆస్తులను కాపాడటానికి వెంటనే జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. 2019 నుంచి ఇప్పటివరకు ఆడిట్ నిర్వహించకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. చర్చి భూములను కాపాడుకుంటామన్నారు. ఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి సంస్థకు చెందిన భూమిలో ఇళ్ల స్థలాలు కేయించడాన్ని తాము ఒప్పుకోమని స్పష్టం చేశారు.
నేరాల నియంత్రణకు
ప్రత్యేక నిఘా
ఇబ్రహీంపట్నం: నేరాల నియంత్రణలో భాగంగా నిరంతరం ప్రత్యేక నిఘాతో పాటు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని డీసీపీ నారాయణరెడ్డి ఆదేశించారు. మహేశ్వరం జోన్ పరిధిలోని ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు, దర్యాప్తు అధికారులతో నేరాలపై సమీక్ష సమావేశం స్థానిక గురునానక్ కళాశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేసి చట్టపరంగా నిందితులకు శిక్షపడేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి పకడ్బందీగా నిబంధనలు అమలు చేయాలన్నారు.


