భవ్య స్కీమ్, బిర్లా, పామ్ ఆయిల్ పరిశ్రమలు కేటాయించిన భూమి 522 ఎకరాలు త్వరలో మరిన్నింటికి భూ కేటాయింపులు
దుద్యాల్: హకీంపేట్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దుద్యాల్ మండలం లగచర్ల, పోలేపల్లి, హకీంపేట్ గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం 1,200 ఎకరాలు సేకరించిన విషయం తెలిసిందే. ఇందులో 250 ఎకరాలు ఎడ్యుకేషన్ హబ్‌కు కేటాయించగా.. మిగతా భూముల్లో కంపెనీలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్ పనులు ప్రారంభం కాగా.. తాజాగా 440 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మూడు పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవ్య స్కీమ్, బిర్లా, పామ్ ఆయిల్ కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. వీటికి భూ కేటాయింపులు కూడా జరిగినట్లు సమాచారం.
ఆయా కంపెనీలకు..
భవ్య స్కీమ్ కంపెనీకి 419 ఎకరాలు, బిర్లా ఉత్పత్తులకు 66 ఎకరాలు, ప్రభుత్వ పామ్ ఆయిల్ కంపెనీకి 37 ఎకరాలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఆయా పరిశ్రమలకు సంబంధించిన పనులు కూడా సాగుతున్నట్లు సమాచారం. కేటాయించిన స్థలాల్లో ఇప్పటికే మట్టి పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
వందకు పైగా పరిశ్రమలు
మండలానికి పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. మరో 110 ఎకరాల అసైన్డ్ భూములను సేకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన సర్వేను కూడా పూర్తి చేసింది. ఈర్లపల్లి, సంట్రకుంట తండా, నన్యా నాయక్ తండాల్లో 374 ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధమైంది. త్వరలో బాధిత రైతులకు పరిహారం చెక్కులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశ్రామిక వాడలో దాదాపు వందకు పైగా కంపెనీలు వచ్చే అవకాశం ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు.
నిరుద్యోగులకు శుభవార్త
మండలం వెనుకబడిన ప్రాంతం కావడంతో ఎక్కువగా వలసలు ఉండేవి. త్వరలో ఈ సమస్యకు చెక్ పడనుంది. పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని యువత భావిస్తోంది. వలస వెళ్లాల్సిన పని ఉండదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉద్యోగం లభిస్తే ఆర్థిక ఎదుగుదల సాధిస్తామని అంటున్నారు.
హకీంపేట్‌లో మూడు కంపెనీల ఏర్పాటుకు రంగం సిద్ధం


