సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్‌ టవర్‌ ఎక్కి వ్యక్తి హల్‌చల్‌

Mar 15 2026 6:48 AM | Updated on Mar 15 2026 6:48 AM

పోలీసులు న్యాయంచేయడం లేదని ఆరోపణ

డీఎస్పీ హామీతోకిందికి దిగిన నిరసనకారుడు

మోమిన్‌పేట: పోలీసులు న్యాయం చేయడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన సంఘటన మోమిన్‌పేటలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన మర్రి మోహన్‌రెడ్డి మోమిన్‌పేటలో నివసిస్తున్నాడు. డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్న తన మేనకోడలి తండ్రి చనిపోవడంతో మోహన్‌రెడ్డి సంరక్షణలో ఉంటోంది. ఇదిలా ఉండగా, బుద్ధేరాలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదివే తన కూతురు కనిపించడం లేదంటూ మోహన్‌రెడ్డి సోదరి వరలక్ష్మి ఫిబ్రవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిరిపురం గ్రామానికి చెందిన పట్లోళ్ల సందీప్‌రెడ్డిపై అనుమానం వ్యక్తం చేస్తూ మోహన్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయమై సీఐ వెంకట్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సందీప్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసి, వెంటనే రిమాండ్‌కు తరలించాలంటూ మోహన్‌రెడ్డి పలుమార్లు పోలీసులను ఆశ్రయించాడు. వారి నుంచి స్పందన లేకపోవడంతో శనివారం మోమిన్‌పేటలోని సెల్‌ టవర్‌ నిరసన వ్యక్తంచేశాడు. సీఐ వెంకట్‌తో పాటు అప్పట్లో విధులు నిర్వర్తించిన ఎస్‌ఐ అరవింద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు. మూడు గంటల పాటు టవర్‌పై ఆందోళన చేయడంతో డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకి దిగివచ్చాడు.

సహకరించడం లేదు..

ఈవిషయమై సీఐ వెంకట్‌ను అడగగా.. అమ్మాయి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తేనే నిందితుడిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. అమ్మాయి మేనమామ ఇందుకు సహకరించడం లేదన్నారు. మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పర్చాలని, అక్కడే స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేయాల్సి ఉంటుందని పలుమార్లు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదన్నారు. బాలికను గత నెల 14న సఖి కేంద్రానికి తరలించగా మోహన్‌రెడ్డి ఆమెను తీసుకెళ్లాడని, ఎన్నిసార్లు చెప్పినా తీసుకురావడం లేదని స్పష్టంచేశారు. అమ్మాయి స్టేట్‌మెంట్‌ లేకుండా పోక్సో కేసు ఎలా నమోదు చేస్తామని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement