దుద్యాల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీస్‌లు పట్టుకున్నారు. ఈ సంఘటన దుద్యాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి పోలెపల్లి గ్రామవాసికి చెందిన (టీఎస్06 యూడీ4286) నంబర్ గల ట్రాక్టర్ గ్రామం నుంచి దుద్యాల్ మీదుగా వెళ్తున్న క్రమంలో దుద్యాల్ గేట్ సమీపంలో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లుగా గుర్తించి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
వారికి క్లీన్‌చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం
తాండూరు: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సందల్‌రాజుగౌడ్ అన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నివాసంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. క్లీన్‌చిట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇదే విషయమై హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు నర్సింహులు, సంతోష్‌గౌడ్, శ్రీనివాసచారి, కౌన్సిలర్లు అనిల్, ఇర్షద్, యోగానంద్ ఉన్నారు.
తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా మహేశ్ కుమార్
అనంతగిరి: తెలంగాణ హైకోర్టు పరిధిలో నిర్వహించిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వికారాబాద్ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఆకుల మహేష్ కుమార్ ఘన విజయం సాధించారు. మొత్తం 203 మంది అభ్యర్థులు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. మంచి పేరు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారనే పేరు ఉంది. పదవీ కాలం ఐదేళ్ల పాటు ఉంటుంది. తనను విశ్వసించి గెలిపించిన న్యాయవాదులందరికీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గెలుపుపై న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు, మేధావులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ యార్డు, పరిసరాల్లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు తెలిపారు. శనివారం సీసీ కెమెరాల ఏర్పాటుపై ఏఎంసీ కార్యదర్శి ఫసియొద్దీన్, ది గ్రేన్ మర్చంట్ కమిటీ అధ్యద్యక్షుడు చిగుళ్లపల్లి రమేష్‌కుమార్‌తో చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సిబ్బంది సాయికుమార్, రాజు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.


