కొడంగల్: పట్టణంలోని బాలాజీనగర్‌లో వెలిసిన పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ లోకనాథం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం బాలాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉత్సవమూర్తులకు శేష వస్త్రం, పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, ఆలయ ధర్మకర్తలు రత్నం, మధు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మురహరి వశిష్ట పాల్గొన్నారు.
బాలాలయం ఆవరణలో
బ్రహ్మోత్సవాలు బాలాలయం ఆవరణలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల తరహాలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా వాహన సేవలు, నిత్య పూజలు, సుప్రభాతం, తోమాల సేవ, అలంకరణ తదితర పూజలను భక్తుల సమక్షంలో చేస్తారు. సోమవారం ఉదయం 9 గంటలకు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8 గంటలకు పెద్ద శేషవాహనం, 17న ఉదయం చిన్న శేషవాహనం, రాత్రి హంస వాహనం, 18న సింహ వాహనం, వ్యాళి వాహనం, 19న కల్ప వృక్ష వాహనం, ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం, రాత్రి 8 గంటలకు సర్వభూపాల వాహనం, 20న పల్లకిలో మోహినీ అవతార ఉత్సవం, టీటీడీ శేష వస్త్రాల సమర్పణ, రాత్రికి గరుడ వాహనం, 21న హనుమంత వాహనం, గజవాహనం, 22న సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం, 23న రథోత్సవం, అశ్వవాహనం, 24న రోహిణీ ఆస్థానం ఉంటుంది. రోజూ సాయంత్రం 7గంటలకు బాలాజీ పాడుతా తీయగా కార్యక్రమం ఉంటుంది.
బాలాలయంలో ఆస్థాన సేవలు
పట్టు వస్త్రాలు సమర్పించిన
టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం
వైఖానస ఆగమంలో పూజలు
తిరుమల తరహాలో వాహన సేవలు


