తాండూరు టౌన్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగింది. ఈ సంఘటన పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాయిపూర్‌నకు చెందిన అంజిలయ్య వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలి సి వివాహ నిమిత్తం ఊరికి వెళ్లారు. బుధవారం వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి, బీరువా తెరిచి ఉన్నట్లు గమనించారు. పరిశీలించగా.. 8 గ్రాముల బంగారం, 5 తులాల వెండితో పాటు రూ. 50 వేలను దుండగులు అపహరించినట్లు గుర్తించారు. అనంతరం బాధిత కుటుంబం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఘనంగా ఎంపీ కొండా
జన్మదిన వేడుకలు
దోమ: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశ్, పాలేపల్లి గ్రామ బూత్ అధ్యక్షుడు నర్సింహులు ముదిరాజ్, కార్యకర్తలు వెంకట్‌రెడ్డి, కృష్ణ, శివ, రఘుపతి, రాఖీలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా మండలంలో 71 పాఠశాలలు ఉండగా.. అందులో ఓ విద్యార్థికి రూ.2,500ల చెక్కును అందజేశారు. విద్యార్థుల ఉన్నతికి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంతగానో తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు.
ఘనంగా స్వయం పరిపాలన
బొంరాస్‌పేట: మండల కేంద్రంలోని రేయిన్‌బో పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌గా మాధురి, డీఈఓగా తరణుమ్, ఎంఈఓగా అభినయ, హెచ్‌ఎంగా హర్షిత, డాక్టర్‌గా అనిత, పొలిటికల్ లీడర్లుగా లోకేశ్, నాగనక్షిత్ తోపాటు 43 మంది ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ఇందులో కరస్పాండెంట్ రాఘవేంద్రయాదవ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం హైమద్, అన్వర్, జనార్దన్, కవిత, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.
పదో తరగతి ఎంతో కీలకం
పూడూరు: విద్యార్థి జీవితంలో పదో తరగతి ఎంతో కీలకమని కడుమూరు సర్పంచ్ శివశంకర్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు, ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. సమయం తక్కువ ఉన్నందున పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. అనంతరం మర్రి అనిల్, చిన్న బందయ్య విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజు, ఉపాధ్యాయులు నవీన్, రాంచంద్రయ్య, సువానయ్య, షఫీ, స్వాతి, జ్ఞానేశ్వరి, రాంప్రసాద్, స్థానికులు సయ్యద్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, రాజు, లింగం తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రతపై
దృష్టి సారించాలి
మర్పల్లి: వ్యక్తి గత పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పంచలింగాల సర్పంచ్ మహేందర్ అన్నారు. బుధవారం గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయరాదన్నారు. పంచాయతీ ట్రాక్టర్‌లోనే వేయాలని సూచించారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు వేయరాదన్నారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను ఎంఈఓ అశోక్‌తో కలిసి సన్మానించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం వేదవ్రత్, హెచ్‌ఎం కేశవులు, ఏఏపీసీ చైర్మన్ జగదాంబ, మహిళా ఉపాధ్యాయులు నవీన, బాలమణి, దివ్వ వార్డు సభ్యులు పాల్గొన్నారు.


