
పేదల బియ్యం వర్షార్పణం
● పట్టించుకోని అధికార యంత్రాంగం
● జిల్లాలో నిరుపయోగంగా మిగులు బియ్యం
కొడంగల్: రేషన్ డీలర్ల దగ్గర మిగిలిన దొడ్డు బియ్యం గురించి జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు. ఐదు నెలలు గడుస్తున్నా మిగులు బియ్యం గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు డీలర్ల దగ్గర ఉన్న బియ్యం నానుతున్నాయి. ఎలుకలు, పంది కొక్కులకు ఆహారంగా మారాయి. పేదల బియ్యం వర్షానికి నాని చెడిపోతున్నాయని డీలర్లు లబోదిబోమంటున్నారు.
వందలాది క్వింటాళ్లు
జిల్లా వ్యాప్తంగా 588 రేషన్ దుకాణాలున్నాయి. ఇందులో ప్రతి నెలా 8,97,270 మంది వినియోగదారులు ఉచిత బియ్యం అందుకుంటున్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యాన్ని ఇస్తున్నారు. జిల్లాలో 2.09 లక్షల ఆహార భద్రత కార్డులు, 25వేల అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెలా జిల్లా పరిధిలో 5,200 టన్నుల బియ్యం అలాట్‌మెంట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది కానుకగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ మాసం నుంచి సన్న బియ్యం పంపిణీ చేశారు. దీంతో మార్చి నెల వరకు రేషన్ డీలర్ల దగ్గర మిగిలిన దొడ్డు బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు డీలర్ల దగ్గరే ఉంచారు. జూన్ నెలలో జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. జులై, ఆగస్టు నెలల్లో రేషన్ దుకాణాలను తెరవలేదు. మిగిలిన ఉన్న దొడ్డు బియ్యం వర్షానికి నాని పురుగుల పాలు అవుతున్నాయి. రేషన్ దుకాణాలు చిన్నపాటి గదుల్లో ఉన్నాయి. అక్కడ దొడ్డు, సన్న బియ్యం నిల్వ చేసుకోడానికి డీలర్లు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల స్పందించి నిరుపయోగంగా ఉన్న దొడ్డు బియ్యాని రేషన్ దుకాణాల నుంచి తరలించాలని డీలర్లు కోరుతున్నారు.