బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా! | - | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!

Aug 21 2025 10:22 AM | Updated on Aug 21 2025 10:22 AM

బ్రిడ

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!

వర్షం వస్తే రాకపోకలు బంద్‌

ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు

పట్టించుకోని అధికారులు

సత్వరమే పనులు చేపట్టాలి..

తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో సంగెంకలాన్‌ ఉంటుంది. ఇక్కడ బండి, దిద్దివాగులు ప్రవహిస్తాయి. భారీ వర్షం వస్తే గ్రామం చుట్టూ ఉన్న వాగులు పొంగిపొర్లుతాయి. దీంతో అక్కడ రాకపోకలు నిలిచిపోతాయి. గతంలో వాగుదాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా ఉంది. అధికారులు స్పందించి సత్వరమే నిర్మాణ పనులు చేపట్టాలి.

– సంజీవ్‌రెడ్డి, సంగెంకలాన్‌ నివాసి

ప్రతిపాదనలు సిద్ధం చేశాం..

బెల్కటూర్‌ బ్రిడ్జి పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇక అల్లాపూర్‌, కోత్లాపూర్‌, ఐనెల్లి నిర్మాణ పనులు నేషనల్‌ హైవే అధికారులు చేపడుతారు. వర్షాకాలం ముగిసిన తర్వాత బొంకూర్‌ పనులు ప్రారంభమౌతాయి. సంగెంకలాన్‌ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలో నిధులు మంజూరవుతాయి. అవి రాగానే వెంటనే పనులు ప్రారంభిస్తాం.

– శ్రావణ్‌కుమార్‌, డీఈ, ఆర్‌అండ్‌బీ, తాండూరు

తాండూరు రూరల్‌: వానకాలం వచ్చిందంటే చాలు ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా కుండపోత వర్షం పడితే వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతాయి. రోడ్లపై, బ్రిడ్జిలపైనుంచి నీరు ప్రవహించడంతో అక్కడక్కడ ఆయా గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోతాయి. వానాకాలంలో ఎప్పుడు ఏమవుతుందోనని భయంతో బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. తాండూరు మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మండలం పూర్తిగా తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో ఉంది.

మండలంలో బ్రిడ్జిలు..

తాండూరు మండలంలో సంగెంకలాన్‌, అల్లాపూర్‌, బొంకూర్‌, ఐనెల్లి, కోత్లాపూర్‌ శివారులో వాగులు ఉన్నాయి. సంగెంకలాన్‌, అల్లాపూర్‌, ఐనెల్లి, కోత్లాపూర్‌ వాగుల వద్ద బ్రిడ్జిలు పురాతనమైనవి. ఒక్కోసారి భారీ వర్షాలకు వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి.

పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌..

బిజ్వార్‌–బొంకూర్‌ వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇంకా ప్రారంభించలేదు. వర్షాకాలం పూర్తయిన తర్వాత ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.

అసంపూర్తిగా బెల్కటూర్‌ ..

తాండూరు నుంచి కరన్‌కోట్‌ మార్గంలోని బెల్కటూర్‌ వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల సందర్భంగా వాగులో నిర్మించిన డైవర్షన్‌ రోడ్డు ఇప్పటి వరకూ నాలుగు సార్లు కొట్టుకపోయింది. దీంతో బెల్కటూర్‌, చిట్టిఘనాపూర్‌, చంద్రవంచ, కరన్‌కోట్‌, ఓగిపూర్‌తో పాటు కర్ణాటకలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వెంటనే పనులు పూర్తి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సంగెంకలాన్‌ చుట్టూ వాగులే..

భారీ వర్షం వచ్చిందంటే చాలు సంగెంకలాన్‌ చుట్టూ ఉన్న వాగులు పొంగిప్రవహిస్తాయి. గ్రామానికి వెళ్లేదారిలోని వంతెనపై నుంచి వర్షపు నీటి ప్రవాహం ఉంటుంది. దీంతో రాకపోకలు నిలిచి పోతాయి. అత్యవసరమయితేనే తాము వెళ్తామని వాపోతున్నారు. ప్రస్తుతం తాండూరు మండలంలో నేషనల్‌ హైవే పనులు కొనసాగుతున్నాయి. అల్లాపూర్‌, ఐనెల్లి, కొత్లాపూర్‌ బ్రిడ్జిలు నేషనల్‌ హైవే పరిధిలో రావడంతో ఇప్పటి వరకు కనీసం పనులు కూడా ప్రారంభించలేదు.

కరన్‌కోట్‌కు నిలిచిన

బస్సు సౌకర్యం

బెల్కటూర్‌ వద్ద తెగిన డైవర్షన్‌ రోడ్డు

తాండూరు మండలం బెల్కటూర్‌ వద్ద నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నారు. వాహనాల రాకపోకల కోసం డైవర్షన్‌ రోడ్డు నిర్మించారు. కానీ భారీ వర్షం వల్ల నేటి వరకు ఐదుసార్లు కోట్టుకపోయింది. దీంతో తాండూరు–కరన్‌కోట్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ద్విచక్రవాహనాలు మాత్రమే వెళ్తున్నాయి. కరన్‌కోట్‌ గ్రామానికి ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం నిలిపివేశారు.

ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు..

డైవర్షన్‌ రోడ్డు కొట్టుకపోవడంతో బెల్కటూర్‌, చిట్టిఘనాపూర్‌, చంద్రవంచ, కరన్‌కోట్‌, ఓగిపూర్‌లకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండూరు నుంచి బెల్కటూర్‌ వరకు ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. ఆ తర్వాత బ్రిడ్జిపైనుంచి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!1
1/3

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!2
2/3

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!3
3/3

బ్రిడ్జిలకు మోక్షం కలిగేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement