
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
వెంగళరావునగర్: నగరంలోని కాలనీలు, బస్తీలు నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్–19 పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ.. పరిశుభ్రత, ప్రజారోగ్యం.. ఈ రెండూ విడదీయరాని అంశాలని, పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతాయని చెప్పారు. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యంగా మాన్సూన్ శానిటేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు పేర్కొన్నారు. నగర ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో క్రియాశీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వానలు తగ్గుముఖం పట్టినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూసేందుకు నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కర్ణన్ సూచించారు. అనంతరం సర్కిల్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం, జానకమ్మతోట, రహమత్‌నగర్, ఎస్‌సీఆర్ హిల్స్, బోరబండ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించారు. కర్ణన్ వెంట శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ బోర్ఖడే హేమంత్ సహదేవ్‌రావు, హెల్త్ అండ్ శానిటేషన్ అదనపు కమిషనర్ సి.ఎన్.రఘుప్రసాద్, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి, ఏసీపీ ప్రసీద, డీఈఈ భద్రు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.