
కొత్వాల్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కోర్టు
సాక్షి, సిటీబ్యూరో: అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అధికారాలు కలిగిన నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ బుధవారం బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఎగ్జిక్యూటివ్ కోర్టు నిర్వహించారు. సౌత్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్లలో ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్న రౌడీషీటర్లు, క్రిమినల్ గ్యాంగ్‌ల సమస్యను పరిష్కరించారు. పోలీసుస్టేషన్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన కొత్వాల్ ఆయా గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం పది పోలీసుస్టేషన్లకు సంబంధించిన 11 గ్యాంగ్‌లకు చెందిన 101 మందిని విడిగా విచారించారు. అందులో ఆరు గ్యాంగ్‌లు తమ పెద్దలు, కుటుంబీకుల సమక్షంలో శాంతియుతంగా రాజీ చేసుకున్నామని కొత్వాల్‌కు తెలిపాయి. మిగిలిన గ్యాంగ్‌లు భవిష్యత్తులో కూడా శాంతియుతంగా ఉంటామని హామీ ఇచ్చాయి. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉన్నట్లయితే వారితో బాండ్ రాయించుకుంటామని తెలిపారు. ఆపై ఈ కోర్టు విచారణను తదుపరి విచారణకు వాయిదా వేశారు. ఈ కోర్టుకు స్పెషల్ బ్రాంచ్ డీసీపీ అపూర్వరావుతో పాటు పది ఠాణాలకు చెందిన అధికారులు హాజరయ్యారు.