
మండపాలకు అనుమతులు తప్పనిసరి
ఎస్‌ఐ యాదగిరి
దుద్యాల్: గణపతి మండపాలకు పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్‌ఐ యాదగిరి పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27న వినాయక చవితి పురస్కరించుకుని మండలంలోని ప్రతీ గ్రామంలో వినాయకుల ప్రతిమలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకుగాను మండల వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న వినాయక మండపాలకు నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర పోలీస్ శాఖ ఒక ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించిందన్నారు. ఈ వెబ్ సైట్‌లో మండపాలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తే అనుమతి లభిస్తుందని తెలిపారు. ఈ అనుమతి ఉంటేనే అవసరమైన సమయంలో పోలీస్ బందోబస్త్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ఆయన సూచించారు.
పోలీసులకు చిక్కిన
గ్యాంగ్ రేప్ నిందితుడు
మంచాల: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మంచాల పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్ రాష్ట్రం బచ్చావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2006లో గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితుడు సికిందర్ రహమతుల్లా 2014 వరకు శిక్ష అనుభవించాడు. 2014లో పెరోల్‌పై బయటకు వచ్చి, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతని కోసం గుజరాత్ పోలీసులు 11 ఏళ్లుగా గాలిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో మంచాల మండలంలోని లింగంపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్న రహమతుల్లాను పట్టుకున్న స్థానిక పోలీసులు గుజరాత్ పోలీసులకు అప్పగించారు.
లాడ్జి గదిలో వ్యక్తి మృతి
కొత్తూరు: లాడ్జి గదిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన జోగన్నగూడెం రమేశ్(37) ఈ నెల 19న పని ఉందని ఇంట్లో చెప్పి కొత్తూరుకు వచ్చాడు. కొంత కాలంగా ఆయనకు మూర్చా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా పట్టణంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని మద్యం తాగాడు. మధ్యరాత్రి లాడ్జి సిబ్బంది గమనించగా పడుకున్న చోటనే రమేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
‘ఖజానా’ కేసులో
మరో ఇద్దరి అరెస్ట్
పుణేలో అంతర్రాష్ట్ర దొంగల్ని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
చందానగర్: ‘ఖజానా’ జ్యువెలరీలో దోపిడీకి సంబంధించి మరో ఇద్దరు దొంగలను పుణేలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చందానగర్ డీఐ భాస్కర్ వివరాలు వెల్లడించారు. ఖజానా దొంగతనం కేసులో ఏడుగురు పాల్గొనగా ఇప్పటి వరకు నలుగుర్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే బిహార్‌కు చెందిన అశిష్, దీపక్ కుమార్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరో ఇద్దరు కూడా బిహార్‌కు చెందిన అనిష్‌కుమార్ సింగ్, ప్రిన్స్ కుమార్ రజాక్‌లుగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. వీరిద్దరిని కూడా రిమాండ్‌కు తరలించామన్నారు. వారి వద్ద నుంచి 1015 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక పిస్తోల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. మిగితా ముగ్గుర్ని త్వరలోనే పట్టుకుంటామన్నారు.
పుస్తకాలు, పత్రికలు
చదవండి
విద్యార్థులకు హైడ్రా కమిషనర్ సూచన
ఉస్మానియా యూనివర్సిటీ: విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాలు, దిన పత్రికలను చదడం అలవాటుగా చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. బుధవారం ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన రంగనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సానుకూల థృక్పథంతో భవిష్యత్‌కు మంచి పునాదులు వేసుకోవాలని సూచించారు. ఓయూ వీసీ ప్రొ.కుమార్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రమం తప్పకుండ తరగతులకు హాజరుకావాలన్నారు. విద్యార్థుల జీవితంలో 90 శాతం విజయం కష్టపడి పని చేయడం వల్ల, 5 శాతం స్మార్ట్ వర్క్, 5 శాతం నెట్ వర్కింగ్ వల్ల లభిస్తుందన్నారు. సోషల్ మీడియాపై ఆధారపడకుండ పుస్తకాలను చదవడం అలవాటుగా పెట్టుకోవాలని విద్యార్థులకు చూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.చంద్రశేఖర్, ఇంజినీరింగ్ విభాగం సీనియర్ డైరెక్టర్ సుమన్ సిన్హా, ఇంజినీరింగ్ డీన్ ప్రొ.ఎ.కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ ప్రొ.మంగు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

మండపాలకు అనుమతులు తప్పనిసరి