
ఎలక్షన్ కమిషన్ మోదీ కమిషన్‌గా మారింది
పంజగుట్ట: దేశంలో హిందుత్వ, ఫాసిస్టు విధానాల అమలులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్‌ను మోదీ కమిషన్‌గా మార్చిందని పలువురు వక్తలు విమర్శించారు. తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం, జాగో నవ భారత్, ఓట్ నీడ్ గ్యారంటీ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘వుయ్ డిమాండ్ ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్–ఫెయిర్ ఎలక్షన్స్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్ చంద్రకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నేత చలపతిరావు, ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల మాయాజాలంలో ఓట్ల చోరీతో ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగ యంత్రాంగాలను నిర్వీర్యం చేస్తున్నారని, బిహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నందున ఎన్నికల కమిషన్ కొత్త నాటకం ఆడుతుందని, అందులో భాగమే ఓటర్ల సవరణ అని అభిప్రాయపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర బాడీగా ఉండాలని, అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగుతుందన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీకి తొత్తుగా మారిందని విమర్శించారు. ఒకప్పుడు ఎన్నికల్లో ఫిజికల్ రిగ్గింగ్ జరిగేదని, ఇప్పుడు డిజిటల్ రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపించారు. సమావేశంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, జానకి రాములు, పోటు రంగారావు, వి.శ్రీనివాస్, సోహ్రాబేగం, పాశం యాదగిరి, బండి దుర్గా ప్రసాద్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల విమర్శ