
కలెక్టరేట్‌కు కళంకం
అధికారిపైపోక్సో కేసు నమోదు
పాలనాధికారి కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. కీలక శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు లంచావతారం ఎత్తారు. పైసలు ఇస్తే పనిచేస్తామని చెప్పడంతో పాటు.. తోటి ఉద్యోగులు, ఇతరులతో అసభ్యకరంగా ప్రవర్తించి కలెక్టరేట్‌కు కళంకం తెస్తున్నారు.
వికారాబాద్: కీలక శాఖల్లో విధులు నిర్వహించే మెజార్టీ అధికారులు లంచావతారమెత్తడం కలకలం రేపుతోంది. జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. లంచం తీసుకుంటూ జిల్లాకు గుండెలాంటి కలక్టరేట్‌లోనే ఓ మహిళా ఉద్యోగి ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్పీ కార్యాలయంలో ఓ డీఎస్పీ, తాండూరు సబ్ కలెక్టరేట్‌లో ఓ తహసీల్దార్, మరో సీనియర్ అసిస్టెంట్ పట్టుబడగా.. తాజాగా పాలనాధికారి కార్యాలయమే అనిశా దాడులకు వేదికయింది.
వరుస ఘటనలు
ధారూరు ఎస్‌ఐ, డ్రైవర్ ఏసీబీకి చిక్కి నాలుగు నెలలు గడవక ముందే కలెక్టరేట్ ఉద్యోగి పట్టుబడటంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. కలక్టరేట్‌లోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల క్రితం ఇక్కడే ట్రెజరీ శాఖకు చెందిన ఓ అధికారి, మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న అపవాదు మరువక ముందే.. తాజాగా కో–ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే ఓ వ్యక్తి మద్యం సేవించి కలక్టరేట్ ఆవరణలోకి ప్రవేశించాడు. అక్కడ ఆడుకుంటున్న ఓ చిన్నారికి మాయమాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన కలక్టరేట్ ఎదుట ఉన్న కాలనీ వాసులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలా కలెక్టరేట్‌లో ఏదో ఒక ఘటన జరుగుతుండటంతో ప్రతిష్ట మసకబారుతుందనే వాదన వినిపిస్తోంది.
ముడుపులు చెల్లించి
పోస్టింగులు తీసుకొని!
అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముడుపులు చెల్లించి పోస్టింగులు తీసుకున్న అధికారులు.. ఆ వెంటనే వసూళ్లకు తెగబడుతున్నారు. లంచంగా ఇచ్చిన సొమ్మును ఎలా పూడ్చుకోవాలని మొహమాటం లేకుండా కొందరు అధికారులు మాట్లాడటం గమనార్హం. ఇదే విషయం ఉన్నత స్థాయిలో ఉన్న పర్యవేక్షణాధికారులకు అడ్డంకిగా మారుతోంది. తమకు నేతల అండ ఉందన్న ధైర్యంతో కొందరు అధికారులు.. పర్యవేక్షణాధికారులను కూడా లెక్కచేయటం లేదన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో నేతలే కీలక భూమిక పోషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
బాధితులు ఎందరో..
నాలుగు నెలల క్రితం ఎస్‌ఐతో పాటు అతని డ్రైవర్, ఐదు నెలల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టబడిన విషయం తెలిసిందే. ఇలా అధికారులు డబ్బుల డిమాండ్‌ను తట్టుకోలేక బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. గతంలో తాండూరులో ఓ సబ్ రిజిస్ట్రార్, పరిగిలో ఎంపీడీఓ, ఈజీఎస్ ఉద్యోగి, రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్, వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారి, వికారాబాద్‌లో ఇంజినీర్, వికారాబాద్ ఎకై ్సజ్ కార్యాలయంలో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ అనిశా వలకు చిక్కడం చూస్తూనే ఉన్నాం. తాజాగా పట్టుబడిన వారు పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వారు కాగా.. మిగతా డిపార్ట్ మెంట్లలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదన్నట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, మైనింగ్, సబ్ రిజిస్ట్రార్, ఎస్టీఓ, డీటీఓ, ఆర్టీఏ, పోలీస్ శాఖ ఏదైనా.. లెక్క తక్కువ కాకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు బాహటంగానే పేర్కొంటున్నారు. ముడుపుల విషయంలో వెలుపలకు రాని బాధితులు ఎందరు ఉన్నారో తెలియదని, ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
మసకబారుతున్న ప్రతిష్ట
పాలనాధికారి కార్యాలయకేంద్రంగా అవినీతి జలగలు
లంచావతారమెత్తుతున్న అధికారులు
తరచూ ఏసీబీకి చిక్కుతున్న ఉద్యోగులు
అయినా మారని తీరు
అనంతగిరి: కలెక్టరేట్ కార్యాలయంలో కో–ఆపరేటివ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న నరేందర్.. శనివారం ఓ ఎనిమిదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబీకులు అధికారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సదరు వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ భీంకుమార్ తెలిపారు.
ఏసీబీ నిఘా
మరికొందరు పర్యవేక్షణ అధికారులు.. తమ కింది స్థాయి సిబ్బంది చేసే అవినీతిలో భాగస్వాములుగా మారుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉండగా.. వరుస ఘటనలతో రెవెన్యూ, హెల్త్, పోలీసు, మున్సిపల్ శాఖల్లో విధులు నిర్వహించే పలువురు అధికారులపై అనిశా నిఘా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు హెచ్చరించినట్లు సమాచారం. వికారాబాద్‌తో పాటు పూడూరు, నవాబుపేట, మోమిన్‌పేట తహసీల్దార్లపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పరిగిలో పనిచేసిన తహసీల్దార్‌పై కూడా ఆరోపణలు ఉన్నాయి.