
వీధి కుక్కల వీరంగం
● పరిగి, కొడంగల్‌లో 26 మందిపై దాడి
● ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు నిల్
పరిగి/కొడంగల్: వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆదివారం ఒక్క రోజే పరిగి, కొడంగల్‌లో 26 మందిపై దాడి చేసి, విచక్షణా రహితంగా గాయపర్చి ఆస్పత్రి పాలు చేశాయి. పరిగి ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందులేక పోగా.. కొడంగల్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితులను నగరానికి తరలించారు. పరిగి పట్టణ కేంద్రంలోని ఖాన్‌కాలనీ, మార్కెట్ యార్డులో ఓ శునకం 16 మందిని కరిచింది. బాధితులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు వెళ్లగా.. సరైన మందు లేదని పేర్కొంటూ.. తాండూరుకు రిఫర్ చేశారు. దీంతో పలువురు ప్రభుత్వ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 పడకల ఆస్పత్రిలో కుక్క కాటుకు మందు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. కుక్కలు ప్రజలపై దాడి చేస్తున్నాయని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గడిచిన నెలలో పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో 158 కేసులు నమోదు అయ్యాయని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. పురపాలిక అధికారులు స్పందించి వీధి కుక్కలను నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం
ఏరియా ఆస్పత్రిలో కుక్కకాటుకు మందు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్ ఆరోపించారు. కుక్కకాటు బాధితులు చికిత్సకోసం ఆస్పత్రికి వెళ్లగా.. మందు లేదని పంపించడం శోచనీయమన్నారు. దీంతో బాధితులకు వికారాబాద్‌లో చికిత్స చేయించామని పేర్కొన్నారు.
కొడంగల్‌లో పదిమందిపై..
పట్టణంలోని పలు ప్రాంతాల్లో పది మందిపై ఆదివారం తెల్లవారుజామున వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. విధుల్లో ఉన్న మున్సిపల్ కార్మికుడు జోగు అనంతయ్యతో పాటు మరికొందరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కార్గిల్ కాలనీలో నివాసం ఉంటున్న కురుమయ్య, పట్టణంలో ఓ చిన్నారిపై దాడి చేశాయి. బాధితులకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిల్లో ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. పట్టణంలో వీధి కుక్కల బెడద అధికమైందని, వాటి నివారణకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు.

వీధి కుక్కల వీరంగం