
పసుపు సాగుకు మొగ్గు
మోమిన్‌పేట: రెండు దశాబ్దాల క్రితం వరకు నీటి వసతి ఉన్న ప్రతి రైతూ పసుపు పంట సాగు చేశాడు. అర ఎకరం నుంచి మూడెకరాల వరకు పంట పండించేవారు. అప్పట్లో పసుపు దిగుబడికి మార్కెట్‌లో ధర లేకపోవడం, పెట్టుబడి కూడా భారీగా పెట్టాల్సి ఉండటంతో చాలా మంది ఇతర పంటల వైపు మళ్లారు. గత ఏడాది కేవలం 50 ఎకరాల్లో మాత్రమే పంట వేయగా ప్రస్తుత సీజన్‌లో 150 నుంచి 200 ఎకరాల వరకు సాగు చేశారు. రెండు మూడేళ్లుగా పసుపు పంటకు డిమాండ్ ఉండటం, క్వింటాలు రూ.10 వేలకు పైగా ధర పలుకుతుండటంతో ఎక్కువ మంది మక్కువ చూపుతున్నారు.
ఖర్చులు అధికం
ఇతర పంటలతో పోలిస్తే పసుపు సాగుకు ఖర్చు ఎక్కువ. ఒక ఎకరాకు దాదాపు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గతంలో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చేది. క్వింటాలు ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు పలికేది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ప్రస్తుతం సాగులో నూతన పద్ధతులు రావడంతో పంట దిగుబడి బాగా వస్తోంది. అంతేకాకుండా దిగుబడికి మంచి డిమాండ్, ధర ఉంటోంది. దీంతో ఎక్కువ మంది రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు.
ఆధునిక పద్ధతిలో..
పాత పద్ధతిలో కాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పసుపు పంట సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నాగలి వెంట విత్తనం వేయడం కాకుండా బోజ, బెడ్డు పద్ధతిలో సాగు చేస్తున్నారు. బెడ్డులో విత్తనం తక్కువ పట్టడం, డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా కొంత మేర కూలీల ఖర్చులు తగ్గించుకోవచ్చని రైతులు అంటున్నారు. బెడ్, డ్రిప్ పద్ధతిలో భూమి గుల్లగా ఉండి కొమ్ము సాగుకు అనుకూలంగా ఉంటుందని, అంతేకాకుండా దిగుబడి పెరుగుతుందని తెలిపారు. ఎరువులు, నీటి యాజమాన్యం సరైన పద్ధతిలో పాటిస్తే మంచి దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారి అక్షితారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం మే నెలలో విత్తన రాయితీ ఇచ్చి ఉంటే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండేదని రైతులు తెలిపారు. చాలా మంది విత్తుకున్న తర్వాత దరఖాస్తులు స్వీకరించడం ద్వారా రైతులు ప్రభుత్వ సదుపాయం పొందలేకపోయారు.
ధర బాగుండటంతో రైతుల ఆసక్తి
గత ఏడాది 50 ఎకరాల్లో..
ఈ సారి దాదాపు 200 ఎకరాల్లో పంట