
వాగు.. పారితే ఆగు
వికారాబాద్: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు.. పొంగిపొర్లుతున్న వంకలు.. అలుగు పారుతున్న చెరువులు ప్రజలకు ఆందోళనకు గురి చేస్తుంటే మరో రెండు మూడు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా మండలాల్లోని లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల వద్ద పోలీసులు మోహరించారు. ప్రమాదకరంగా ప్రవహించే వాగులు దాటరాదని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని కలెక్టర్, ఎస్పీ ప్రజలకు సూచించారు. మూడేళ్ల క్రితం జిల్లాలో భారీ వర్షాలకు అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ప్రాణ ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.. కొన్ని చోట్ల అజాగ్రత్త ప్రాణాలను హ రించిగా మరి కొన్ని చోట్ల ఊహించని వరద ఉధృతి రెప్పపాటులో కబలించి వేసింది. ఇంకొన్ని చోట్ల మానవ తప్పిదాలతో ప్రాణాలు గాల్లో కలిశాయి.
గతంలో చోటుచేసుకున్న ప్రమాదాలు
● గడిచిన మూడేళ్లలో జిల్లాలో భారీ వర్షాల కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొందరు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడి మరణించారు. వంతెనలు దాటే క్రమంలో వాహనాలు ప్రమాదాలకు గురి కావడంతో మరి కొందరు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు కొన్ని..
● ధారూరు మండలంలో పొంగిపొర్లుతున్న వాగును దాటే క్రమంలో ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఐదు మంది రైతులు గల్లంతు కాగా తోటివారు రక్షించారు.
● తాండూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి పక్క గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది.
● మూడేళ్ల క్రితం అతి భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు పొంగిపొర్లడంతో వరద ప్రవాహంలో ఏడుగురు చిక్కుకొని మరణించారు. మరో 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
● ప్రస్తుతం కూడా అదే తరహాలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశంకనిపిస్తోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండరాదని అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాకు అతిభారీ వర్ష సూచన
అన్ని కాజ్‌వేల వద్ద పోలీసుల మోహరింపు
పలు చోట్ల ఉధృతంగా
ప్రవహిస్తున్న వాగులు
ప్రమాదకరంగా లోలెవల్ బ్రిడ్జిలు
సహాయక చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం
జాగ్రత్తగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వరద ఉధృతి ఉంటే వాగులు దాటే ప్రయత్నం చేయరాదు. జిల్లాలోని ప్రమాదకర కాజ్‌వేల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుంచి బయటికి రాకూదు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లకపోవడం మంచిది కాదు. ఏది ఏమైనా సమ యం ప్రాణం కంటే విలువైనది కాదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. వరద ఉధృతి ఉంటే మరో మార్గంలో గమ్యస్థానాలకు చేరుకోవాలి. చెరువు అలుగుల వద్ద సాహసాలు చేయటం, సెల్ఫీలు దిగటం లాంటివి చేయకూడదు.
– నారాయణరెడ్డి, ఎస్పీ

వాగు.. పారితే ఆగు