
హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో 2012లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. ఎస్.శ్రీనివాస్ రెడ్డి జీవిత ఖైదు విధించారని ఎస్పీ నారాయణరెడ్డి బుధవారం తెలిపారు. అప్పట్లో పట్టణంలోని బీటీఎస్ కాలనీకి చెందిన మిర్యాల భాగ్యలక్ష్మిని ఆమె భర్త మిర్యాల రాజు, అతని పెదనాన్న కుమారుడు మల్లేశం కలిసి దారుణంగా హత్య చేశారు. మిర్యాల రాజు జులాయిగా తిరుగుతూ, మద్యానికి బానిసయ్యాడు. తన ఇంటిని అమ్మాలని ప్రయత్నించగా, భార్య భాగ్యలక్ష్మి పిల్లల భవిష్యత్తు కోసం వద్దని వేడుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు.. మల్లేశంతో కలిసి మే 29న భాగ్యలక్ష్మి మెడకు కేబుల్ వైర్ బిగించి హత్య చేశాడు. మృతురాలి తల్లి కుర్వ కిష్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి వికారాబాద్ సీఐ లచ్చిరాం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి చార్జ్ షీట్ దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల ఆధారంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి డా. ఎస్.శ్రీనివాస్ రెడ్డి వాదోపవాదనలు విని, నిందితులు మిర్యాల రాజు, మల్లేశంలను దోషులుగా నిర్ధారించారు. నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ తుది తీర్పు వెలువరించారు. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులను ఎస్పీ అభినందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.సుధాకర్ రెడ్డి, మొదటి దర్యాప్తు అధికారి లచ్చిరాం, అప్పటి ఎస్‌ఐ శ్రీనివాస్, ప్రస్తుత వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ భీమ్ కుమార్, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ ఎల్.నరేందర్, లైజన్ ఆఫీసర్ బి.వీరన్న (ఎస్‌ఐ)లను ఆయన పేరు పేరునా ప్రశంసించారు.
కేసులు పెండింగ్‌లో ఉంచొద్దు
పరిగి: పెండింగ్ ఫైళ్లను వెంటనే పూర్తిచేసి న్యాయ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్పీ నారాయణరెడ్డి సూచించారు. బుధవారం పరిగి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని తెలిపారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలను కూడా తక్కువ అంచనా వేయరాదని, వాటిపై కూడా నిఘా ఉంచాలని పేర్కొన్నారు. దొంగతనాల కేసుల పట్ల ప్రత్యేక చొరవ చూపి వాటిని త్వరగా ఛేదించాలని సూచించారు. సీసీ కెమెరాల ఆవస్యకతను ప్రజలకు వివరించి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్పీ నారాయణరెడ్డి