హాంఫట్
వేల ఎకరాలు అన్యాక్రాంతం
● జిల్లాలో అటవీ విస్తీర్ణం 1,08,000 ఎకరాలు ● కబ్జాకోరల్లో 25శాతానికి పైనే.. ● కొడంగల్ నియోజకవర్గంలో 2వేల ఎకరాలు ● బషీరాబాద్ – కర్ణాటక సరిహద్దులో 1,500 ఎకరాలు అక్రమార్కులపాలు ● చోద్యం చూస్తున్న అటవీ శాఖ జిల్లా అధికారులు
అటవీ
భూములు
వికారాబాద్: అటవీ శాఖలో అక్రమాలు.. అవకతవకలు.. ఆక్రమణలు సర్వసాధారణమైపోయాయి. అధికారులు ఎవరు ఉన్న ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అడవుల ఆక్రమణకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రియల్టర్లు, క్వారీల నిర్వాహకులు, రిసార్ట్‌ల యజమానులు ఫారెస్ట్ భూములను యథేచ్ఛగా కబ్జాచేసి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై బదిలీవేటు పడటం అనుమానాలకు తావిస్తోంది. అటవీ భూము ల్లో అభివృద్ధి పేరిట అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారు. జిల్లాలో మొత్తం 1,08,000 ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. అధికారుల లెక్కల ప్రకారం 25 శాతం అంటే (సుమారు 31 వేల ఎకరాలు) ఆక్రమణకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో 94 ఫారెస్టు బ్లాకులు ఉండగా అందులోని కొన్ని బ్లాక్‌లలో ఉన్న ఏరియా మొత్తం కబ్జా కోరల్లోకి వెళ్లి పోయింది. మరికొన్ని చోట్ల 50శాతం నుంచి 90 శాతం వరకు ఆక్రమణలకు గురయ్యాయి. గతంలో చెట్లను నరికి వ్యవసాయం చేసేవారు.. కానీ ఇప్పడు వ్యాపార అవసరాల కోసం కబ్జాలకు పాల్పడుతున్నారు. కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
రూ.కోట్ల విలువ చేసే ఖనిజ సంపద స్వాహా
వికారాబాద్ రేంజ్‌లోని అటవీ భూముల్లో రెండు క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒకచోట రూ.160 కోట్లు, మరో చోట రూ.60 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని తేల్చారు. ఈ విషయమై గతంలో కోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేశారు. తాండూరు ఫారెస్టు రేంజిలోని ఓ క్వారీలో సైతం రూ.60 కోట్ల విలువైన ఖనిజ సంపద కొల్లగొట్టారని గుర్తించి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దుద్యాల్ ఫారెస్టు పరిధిలోని ఓ క్వారీలో సైతం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారని నోటీసులు జారీ చేశారు. అనంతగిరి సమీపంలోని ఫారెస్టు భూమిని ఆక్రమించిన ఓ రిసార్ట్స్ యజమానికి నోటీసులు ఇవ్వడంతో పాటు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. పూడూరు మండలం దామగుండం సమీపంలో ఓ రిసార్ట్స్ ఫారెస్టు భూమిలో ఏర్పాటు చేయగా వారికి నోటీసులు ఇచ్చారు. కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇదంతా గతంలో ఉన్న ఫారెస్టు అధికారులు చేయగా.. ప్రస్తుత అధికారులు వారితో లోపాయికారిగా వ్యవహరిస్తూ చూసీచూడనట్లు ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఆరు నెలల కాలంలో నలుగురు జిల్లా ఫారెస్టు అధికారులు మారారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డీఎఫ్‌ఓ వచ్చాక మొదట్లో కాస్త హల్‌చెల్ చేయగా ఆ వెంటనే మిన్నకుండి పోయారు.
కొడంగల్ నియోజకవర్గంలో..
● కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని 127 సర్వే నంబర్‌లో 2వేల ఎకరాల ఫారెస్టు భూమి ఉంది. మొత్తం అన్యాక్రాంతం అయ్యింది. కేవలం 180 ఎకరాలు ఉండగా దాన్ని స్వాధీనం చేసుకొని హద్దులు ఏర్పాటు చేస్తామని ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రెవెన్యూ అధికారులు ఆ సర్వే నంబర్(127)ను 82కు మార్చారు. ఈ విషయం అటవీ శాఖ అధికారులకు తెలియదు. ఈ భూమి తమదేనని అటవీ శాఖ అధికారులు క్‌లైమ్ చేసుకోలేదు. దీంతో మైనింగ్ అధికారులు క్వారీలు, క్రషర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. పెద్ద ఎత్తున మైనింగ్ తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకున్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొని నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం మైనింగ్ నిర్వాహకులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


