కనీస వేతనాలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్
మోమిన్‌పేట: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పెన్నార్, కార్తికేయ, ఓల్టాగ్రీన్ కంపెనీలలో పని చేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీలలో 12 గంటలు పని చేయించుకొంటున్నా కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోజుకు 12 గంటలు పని చేయించుకొంటున్న యాజమాన్యం రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే అందిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను రూ.26 వేల నుంచి రూ.32 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంబంధించి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మసయ్య, బాబు, ఆనందం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
గీత కార్మికుల
సమస్యలు పరిష్కరించండి
మొయినాబాద్: గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని గౌడ కుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రేనట్ల మల్లేష్‌గౌడ్ కోరారు. ఈ మేరకు ఆదివారం నగరంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ను కలిసి విన్నవించారు. రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గౌడ కుల పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు
పాడి గేదెలు మృతి
కందుకూరు: పిడుగుపాటుతో మూడు పాడి పశువులు మృతి చెందాయి. ఈ సంఘటన మండల పరిధి రాచులూరులో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నల్ల కలమ్మ పాడి పశువులతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. రోజులాగే పొలం వద్ద చెట్టు కింద నాలుగు గేదెలను కట్టేసింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పాటు, పశువుల సమీపాన పిడుగు పడటంతో మూడు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వాటి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరుతోంది.
శంకర్‌పల్లివాసులకు
దళితరత్న అవార్డులు
శంకర్‌పల్లి: పట్టణానికి చెందిన కడమంచి మల్లేశ్, తూర్పాటి నరసింహ దళితరత్న అవార్డులు దక్కించుకున్నారు. ఈ మేరకు వారు ఆదివారం హైదరాబాద్‌లో బెడ బుడగ జంగం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల రాజలింగం, అంబేడ్కర్ ఉత్సవాల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రాజన్న సమక్షంలో అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు శంకర్, తిరుమల హరి, లక్ష్మయ్య, శ్రీను, శివ, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనాలు అమలు చేయాలి
కనీస వేతనాలు అమలు చేయాలి
కనీస వేతనాలు అమలు చేయాలి


