కార్మికులకు భద్రత ఏదీ..?
● సంక్షేమాన్ని మరిచిన యాజమాన్యాలు ● హక్కుల కల్పనలో ప్రభుత్వాలు విఫలం ● ఎన్నికల హమీకే పరిమితమైన ఈఎస్‌ఐ ఆస్పత్రి
తాండూరు: ప్రభుత్వాలు మారుతున్నా.. శ్రమ జీవుల జీవన విధానంలో మార్పులేదు. కష్టాలు వీడడం లేదు. బతుకుబండి సాఫీగా సాగడం లేదు. కుటుంబ జీవన స్థితిగతులు వారిని మరింత కష్టాల కడలిలోకి నెట్టివేస్తున్నాయి. వేతనం గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ మార్గాలు లేక కార్మిక వృత్తినే కొనసాగిస్తూ కష్టాల కడలిని ఈదుతున్నారు. 1886 మే 1వ తేదీన చికాగో నగరంలో కార్మికుల వీరమరణంతో కార్మిక దినోత్సవానికి ఊపిరి పోసింది. నాటి నుంచి ప్రతి ఏటా మేడేను జరుపుకొంటున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా శ్రమ జీవుల హక్కుల కల్పనలో మాత్రం ప్రభుత్వాలు విఫలం చెందుతూనే ఉన్నాయి. కార్మికులు సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.
కేంద్ర సహకారం లేక జాప్యం
జిల్లాలో భూగర్భ నిక్షేపాలు పుష్కలం. దీంతో కార్మికులకు నాపరాయి, ఎర్రమట్టి, సుద్ద వనురుల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, తాండూరు మండలాల్లో 300 వరకు నాపరాతి గనులు, 500 వరకు నాపరాతి షాలిషింగ్ యూనిట్‌లున్నాయి. ఇక్కడ ప్రతీ ఏడాది సుమారు రూ.600 కోట్ల వరకు వ్యాపారం సాగుతోంది. ఇక్కడ పనిచేసే కార్మికులు ప్రమాదాల బారిన పడినా వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున కార్మికులు ఉన్నప్పటికీ తాండూరు ప్రాంతంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటులో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో తాండూరు పాత మున్సిపల్ భవనంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రజా ప్రతినిధులు యత్నించారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో జాప్యం చేసుకొంటోంది.
కూలీలుగా పరిగనిస్తున్న యాజమాన్యాలు
తాండూరు నియోజకవర్గంలో నాపరాతి పరిశ్రమలపై ఆధారాపడి 40 వేల మంది వరకు కార్మికులు నాపరాతి గనులు, పాలిషింగ్ యూనిట్‌లలో పని చేస్తున్నారు. దీంతో పాటు సీసీఐ, ఐసీఎల్, పెన్నా సిమెంట్ కార్మగారాల్లో వేల మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారికి కార్మికులకు అందే ఫలాలు అందడం లేదు. గనులు, నాపరాతి పాలిషింగ్ యూనిట్‌లలో పని చేసే కార్మికులను రోజు వారి కూలీలుగా పరిగనించడంపై కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులకు అందాల్సిన ఫలాలు
● కార్మిక సంక్షేమ నిధి చట్టం ద్వారా ప్రతీ సంస్థ యజమాని కార్మికుడి తరపున ఏడాదికి యజమాని వాటా కింద రూ.70, కార్మికుడి వాటా కింద రూ.30 వార్షిక చందా సంక్షేమ నిధికి చెల్లించాలి.
● వివాహ కానుకగా కార్మికుడి కూమార్తెకు, కార్మికురాలి వివాహం సందర్భంగా రూ.20 వేలను మూడేళ్ల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో అందిస్తారు.
● విద్యా ప్రోత్సాహకం, ప్రతిభ ఆధారంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.5 వేలు, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు రూ.10 వేల వరకు అందిస్తోంది.
● ఆదర్శ కుటుంబం కింద కార్మికుడు లేదా కార్మికుడి భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే రూ.5 వేలు.
● కార్మికుడు మరణిస్తే అంత్యక్రియలకు రూ.10 వేలు.
● ప్రమాదం బారిన పడి అంగవైకల్యం పొందిన కార్మికుడికి రూ.2.50 లక్షల ఆర్థిక సాయం.
● కార్మికుడి వైద్యసాయం కోసం ధీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి వైద్య పరీక్షలకు రూ.50 వేల ఆర్థికసాయం.


