రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం
● ఇచ్చిన మాట ప్రకారం ఫార్మాసిటీ రద్దు చేశాం ● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: పేదల భూములు తీసుకుని రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆదివారం యాచారం మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, ధర్మన్నగూడ, నందివనపర్తి గ్రామాల్లో రూ.75లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నందివనపర్తిలో జ్యోతి ఎడ్యుకేటర్ యూత్ అసోసియషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకులు సంగం సత్తయ్య విగ్రహ ఆవిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మేరకు పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే ఫార్మా రద్దు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైతే మార్కెట్ ధర చెల్లించి రైతులను ఒప్పించాలని.. ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసమే ఫోర్త్ సిటీ తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులతో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నమన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనకబడిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మహిపాల్, నాయకులు శేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్, పాండురంగారెడ్డి, అమృతాసాగర్, ధనుంజయ్‌గౌడ్ పాల్గొన్నారు.


