● మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం ● కలెక్టర్ ప్రతీక్‌జైన్
అనంతగిరి: సావిత్రిబాయి పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆమె చూపిన బాటలో నడుద్దామని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె చిత్రపటాలనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు భవిష్యత్ తరాల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వారి జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే సాంఘిక దురాచారాలను అరికడుతూనే మహిళల విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. మహిళలు విద్యావంతులు అయినప్పుడే వారు సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతారని గుర్తించి 1848 సంవత్సరంలోనే మొట్ట మొదటి మహిళా పాఠశాలను నెలకొల్పారని పేర్కొన్నారు. మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన సేవ ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, డీఈఓ రేణుకాదేవి, డీపీఓ జయసుధ, పౌరసరఫరాల శాక జిల్లా మేనేజర్ విజయలక్ష్మి, డీపీఆర్‌ఓ చెన్నమ్మ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి మోహన్‌రెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహాల్లో తనిఖీలు
కొడంగల్: పట్టణంలోని వసతి గృహాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఆకస్మికంగా తనికీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో వంట గదులు, సామగ్రి, బియ్యం నిల్వను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు కొత్త మోనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బలరాం, ఏఈ రాకేశ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి భీమరాజ్, వార్డెన్లు వరలక్ష్మి, నారాయణ, శ్రీనివాస్, హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
పరిగి: ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. శుక్రవారం పరిగి పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహం, ప్రభుత్వ గిరిజన వసతి గృహం, ప్రీ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం, తుంకులగడ్డలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. గదులను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. తాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్షించాలని సూచించారు. వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. మరమ్మతులకు నిధులు అవసరం అయితే మంజూరు చేస్తామన్నారు. అనంతనం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్‌రావు, వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సూపర్
పరిగి: పట్టణంలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్‌ను శుక్రవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్ పరిశీలించారు. క్యాంటీన్ పరిసరాలను పరిశీలించి శుభ్రంగా ఉండటంతో నిర్వాహకులను అభినందించారు. ఇకపై ఇలాగే కొనసాగించాలని సూచించారు. అనంతరం అధికారులతో కలిసి క్యాంటీన్‌లో మిర్చి, టిఫిన్ చేసి బాగుందని కితాబు ఇచ్చారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, మంచి లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. కలెక్టర్ వెంట అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ ఆనంద్‌రావు తదితరులు ఉన్నారు.