
ఎన్కేపల్లి కల్వర్టుపై ఏర్పడిన గుంత
కూలిన కల్వర్టులు ● తరచూ ప్రమాదాలు
మండిపడుతున్న వాహనదారులు ● పట్టించుకోని అధికారులు
కూలిన కల్వర్టులు ప్రమాదాలకు
నిలయాలుగా మారాయి. అటుగా వెళ్లే వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు.
మూడేళ్లుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బంట్వారం: మండల పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారాయి. దీనికితోడు అక్కడక్కడా కల్వర్టులు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రయాణికులు ఆ మార్గం మీదుగా ప్రయాణమంటేనే జంకుతున్నారు. సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లోని రొంపల్లి, నూరుల్లాపూర్, ఎన్కేపల్లి, కోట్‌పల్లి–తాండూరు మార్గంలోని కల్వర్టులు కూలి మూడేళ్లు గడుస్తున్నాయి. అయినప్పటికీ కొత్తగా నిర్మించడం లేదు. అసలే గుంతలు పడిన రోడ్లు దీనికి తోడుగా కల్వర్టులు కూలిపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఎన్కేపల్లి రోడ్డులో మలుపు వద్దనే కల్వర్టు పై పెద్ద గుంత ఏర్పడింది. కొత్తగా ఆ రోడ్డు మీదుగా ప్రయాణం సాగించేవారు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా గుంతలో పడాల్సిందే. ఇప్పటికే ఇక్కడ పలువురు గాయపడ్డారు. ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళ అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. కూలిన కల్వర్టుల వద్ద లోడింగ్ లారీలు బస్సులు దిగబడే ప్రమాదం ఉంది. ఆర్‌అండ్‌బీ శాఖ తరపున కనీసం హెచ్చరిక బోర్డులు సైతం పెట్టడం లేదు. దీంతో వాహనదారులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరమ్మతులు చేపట్టాలి
కూలిన కల్వర్టుల దగ్గర తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రొంపల్లి, నూరుల్లాపూర్, ఎన్కేపల్లి తదితర మార్గాల్లో కల్వర్టులు కూలి మూడేళ్లు గడిచాయి. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్య తీవ్రత ఉన్నప్పటికీ కనీస మరమ్మతులు చేపట్టడం లేదు. ఇప్పటికై నా పాలకులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. – నర్సింలు, రొంపల్లి
చర్యలు తీసుకుంటాం
కూలిన కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. నూరుల్లాపూర్ సమీపంలో కల్వర్టు నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. ఎన్కేపల్లి, రొంపల్లి, కోట్‌పల్లి–తాండూరు మార్గంలోని కల్వర్టులకు ప్రతిపాదనలు పంపిస్తాం. నిధులు విడుదలయిన వెంటనే పనులు చేపడతాం. – శ్రీనివాస్, డీఈ

నూరుల్లాపూర్ సమీపంలో కల్వర్టు దుస్థితి
