యువత ఐక్యతకే క్రీడా పోటీలు | Sakshi
Sakshi News home page

యువత ఐక్యతకే క్రీడా పోటీలు

Published Thu, Jun 29 2023 5:28 AM

విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, రినీష్‌రెడ్డి  - Sakshi

తాండూరు టౌన్‌: యువతలో సమైక్యతా భావాలను పెంపొందించేందుకే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. పీఎంఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ క్రీడా పోటీలకు, ఎన్నికలకు ఎలాంటిసంబంధం లేదని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నీ ముగింపు సందర్భంగా బుధవారం పట్టణంలో సుమారు 6వేల మందితో పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఆయన తనయుడు రినీష్‌రెడ్డితో కలిసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్నం ఫ్యామిలీకి క్రీడా పోటీలు నిర్వహించడం కొత్తేమీ కాదన్నారు. పీఎమ్మార్‌ ట్రస్టు తరఫున తన తనయుడు రినీష్‌రెడ్డి నేతృత్వంలో సామాజిక కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని ప్రకటించారు. జాబ్‌ మేళాలు నిర్వహించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు. వచ్చే సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో సామూహిక వివాహాలు జరిపించనున్నట్లు చెప్పారు.

యువత సన్మార్గంలో నడవాలి
అనంతరం ఎమ్మెల్సీ తనయుడు రినీష్‌రెడ్డి మాట్లాడుతూ యువత దేశానికి వెన్నెముక అని, యువత తలుచుకుంటే సాధించనిదంటూ ఏదీ లేదని తెలిపారు. అలాంటి యువతను ప్రోత్సహించడంలో భాగంగానే పీఎంఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించామన్నారు. తాను తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ పని చేసి చూపిస్తానన్నారు. యువత మత్తుకు బానిసలు కాకూడదని, తాండూరులో కొందరి వల్ల యువత పెడదోవ పడుతోందని తెలిపారు. యాగాలు, పూజలు జరిపించినంత మాత్రాన చేసిన తప్పులను దేవుడు క్షమించడని వ్యాఖ్యానించారు.

భవిష్యత్‌లో యువతకు అండగా నిలుస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. అనంతరం నియోజకవర్గ స్థాయి టోర్నీ విజేతలకు రూ.2 లక్షలు, రన్నరప్స్‌కు రూ.లక్ష అందజేశారు. పట్టణం, మండల స్థాయి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, బీఆర్‌ఎస్‌ నాయకులు కరణం పురుషోత్తంరావు, లక్ష్మారెడ్డి, డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, అబ్దుల్‌ రవూఫ్‌, నర్సింహులు, రజాక్‌, రవిగౌడ్‌, పరిమళ, శోభారాణి, నీరజా బాల్‌రెడ్డి, నారాయణరెడ్డి, సిద్రాల శ్రీనివాస్‌,అజయ్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement