రణరంగంగా పరిగి
పరిగి: మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. పరిగి పట్టణ పరిధిలో మొత్తం 18 వార్డులు ఉండగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు చెరో 8 వార్డులు వచ్చాయి. దీంతో హంగ్ ఏర్పడింది. ఇద్దరు స్వతంత్రలు గెలుపొందారు. మొదటి వార్డు(నస్కల్) నుంచి కుర్వ అక్కమ్మ, మూడో వార్డు(నజీరాబాద్ తండా) నుంచి హన్మంతు భారీ మెజారిటీతో విజయం సాధించారు. వీరు బీఆర్‌ఎస్ రెబల్స్‌గా పోటీ చేసి విజేతలుగా నిలిచారు. చైర్మన్ పీఠం దక్కించుకోవాలంటే వీరి మద్దతు తప్పనిసరి. వీరిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ పడ్డాయి. ఈ క్రమంలో నేతల మధ్య వాగ్వాదం, గొడవలు చోటుచేసుకున్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గెలుపొందిన ఇద్దరు స్వతంత్రలు తమ పార్టీకి చెందిన రెబల్స్ అని.. అన్యాయంగా పోలీసులు వారి ఆధీనంలో ఉంచుకున్నారంటూ బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసుల, గులాబీ పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నార ని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు మద్దతిస్తామన్న వారిని కాంగ్రెస్ అండదండలతో బలవంతంగా తీసుకెళ్లడం దారుణమన్నారు. ఇదిలా ఉండగా మూడో వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన హన్మంతు.. తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి అక్కడి నుంచి పోలీస్ వాహనంలో వెళ్లిపోయారు. ఒకటవ వార్డు కౌన్సిలర్ కుర్వ అక్కమ్మ (స్వతంత్ర)ను బీఆర్‌ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఆమె కుమారుడు బాల్‌రాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
రణరంగంగా పరిగి


