అనంతగిరి: తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన యోధుడిగా దొడ్డి కొమురయ్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మనకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. రైతుల హక్కులు, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


