కాంగ్రెస్ మ్యాజిక్!
కొడంగల్‌లో వార్ వన్‌సైడ్ తాండూరులోస్పష్టమైన మెజార్టీ పరిగి, వికారాబాద్‌లో హంగ్ ఇండిపెండెంట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ బాహాబాహీ విజయోత్సవాలతో హోరెత్తినపురపాలికలు
మున్సిపల్ ఎన్నికల్లో పైచేయి
వికారాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో హస్తం పార్టీ పైచేయి సాధించింది. బీఆర్‌ఎస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది. జిల్లాలోని నాలుగు పురపాలికల్లో శుక్రవారం ఓట్లు లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించారు. నాలుగింట రెండు చోట్ల కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. వికారాబాద్, పరిగిలో హంగ్ ఏర్పడింది. జిల్లాలో మొత్తం 100 వార్డులు ఉండగా ఏకగ్రీవం అయిన రెండు వార్డులతో కలిపి కాంగ్రెస్ 54 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. బీఆర్‌ఎస్ 32 వార్డుల్లో.. ఏడు చోట్ల బీజేపీ, మూడు వార్డుల్లో ఎంఐఎం, నాలుగు స్థానాల్లో స్వతంత్రులు విజయం సాధించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. మొత్తం 12 వార్డులకు గాను 10 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. వికారాబాద్, తాండూరులోనూ చైర్‌పర్సన్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది.పరిగిలో 18 వార్డులు ఉండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో ఎనిమిది చోట్ల విజయం సాధించగామరో రెండు వార్డుల్లో స్వతంత్రలు సత్తా చాటారు. దీంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ స్వతంత్రులు మద్దతిచ్చిన వారే చైర్‌పర్సన్ కానున్నారు. వికారాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి స్పీకర్ ప్రసాద్‌కుమార్ కూతురు గడ్డం అనన్యజిల్లాలోనే అత్యధికంగా 1,057 ఓట్ల భారీ మెజార్టీతో తన సమీప బీజేపీ అభ్యర్థి దయాకర్‌పై గెలుపొందారు.
రోజంతా ఉత్కంఠే
ఓట్లు లెక్కించినంత సేపు అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకుల్లో ఉత్కంఠ కనిపించింది. కొడంగల్ మినహా పరిగి, వికారాబాద్, తాండూరులో ఫలితాలు దోబూచులాడాయి. పరిగి మొదటి రౌండ్‌లో నాలుగు వార్డులను బీఆర్‌ఎస్ సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు. రెండో రౌండ్‌లో ఫలితాలు తారుమారయ్యాయి. కాంగ్రెస్ ఆధిక్యతను కనబర్చింది. మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్ మళ్లీ పుంజుకుంది. చివరకు చెరో ఎనిమిది వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వికారాబాద్ మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో గెలుపొందింది. రెండో రౌండ్‌లోనూ హవా కొనసాగింది. మూడో రౌండ్‌లో బీఆర్‌ఎస్ పుంజుకుంది. బీజేపీ సైతం నాలుగు వార్డు స్థానాల్లో గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ ఆధిపత్యానికి కాస్త గండి పడింది. తాండూరులో మొదట బీఆర్‌ఎస్ ఆధిక్యతను చాటగా.. రెండు, మూడు రౌండ్లలో కాంగ్రెస్ పుంజుకొని చైర్మన్ పీఠానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంది.
పరిగిలో ఉద్రిక్తత
పరిగిలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ సాగింది. చివరకు చెరో ఎనిమిది వార్డులు కై వసం చేసుకోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. గెలుపొందిన ఇద్దరూ బీఆర్‌ఎస్ రెబల్స్ కావడంతో ఒకరు ముందుగానే ఆ పార్టీ ముఖ్యనేతలతో వెళ్లి పోయారు. మరో అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
2020 మున్సిపల్ ఎన్నికల్లో నాటి అధికార పార్టీ బీఆర్‌ఎస్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. పరిగి, వికారాబాద్, కొడంగల్‌లో స్పష్టమైన మెజారిటీతో చైర్‌పర్సన్ పీఠాలు దక్కించుకుంది. తాండూరు ఇతర పార్టీల మద్దతులో చైర్‌పర్సన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అధికార పార్టీకి ఓటర్లు జై కొట్టారు. మూడింట స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. పరిగిలో మాత్రం సగం సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాండూరులో గత ఎన్నికల్లో బీజేపీకి 8, ఎంఐఎంకు 4 వార్డులు రాగా.. ఈ సారి రెండు పార్టీలు చితికిల పడ్డాయి. బీజేపీ మూడింటికి పడి పోగా.. ఎంఐఎం ఒక్క వార్డుకే పరిమితమైంది. గతంలో వికారాబాద్‌లో ఒకే వార్డుకు పరిమితమైన బీజేపీ ఈ సారి అనూహ్యంగా పుంజుకొని నాలుగు వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. నాలుగు మున్సిపాలిటీల్లో విజయోత్సవాలు మిన్నంటాయి.
పార్టీల వారీగా గెలుపొందిన అభ్యర్థులు
మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఎంఐఎం స్వతంత్రులు
కొడంగల్ 12 10 01 00 01 00
పరిగి 18 08 08 00 00 02
తాండూరు 36 19 12 03 01 01
వికారాబాద్ 34 17 11 04 01 01
మొత్తం 100 54 32 07 03 04
కాంగ్రెస్ మ్యాజిక్!
కాంగ్రెస్ మ్యాజిక్!


