గురుకులాల విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ 

Reopening Of Residential Schools Telangana - Sakshi

సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు తెరుచుకునేందుకు ముహూర్తం ఖరారైంది. గురువారం(21వ తేదీ) నుంచి గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం కానుంది. హైకోర్టు అనుమతి ఇచ్చిన నేథప్యంలో గురుకులాలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో కోవిడ్‌–19 ని బంధనలు పాటిస్తూ ప్రత్యక్ష బోధనతో పాటు ఇతర కార్యకలాపాలు యధావిధిగా సాగించాలని సం క్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శులు బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్వహణలో సుదీర్ఘ సూచనలతో రీజినల్‌ కో–ఆర్డినేటర్లు, జిల్లా సంక్షేమాధికారులు, ప్రిన్స్‌పాళ్లకు ఆదే శాలు జారీ చేశారు. గురుకులానికి వచ్చే విద్యార్థికి కోవిడ్‌–19 నిర్ధారణ తప్పనిసరి కాదని, శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి ప్రవేశం కల్పించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు. చర్యలకు ఉపక్రమించిన క్లాస్‌ టీచర్లు ప్రతి విద్యార్థి రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడి హాజరుపై స్పష్టత ఇచ్చారు.  

బోధనపై దృష్టి సారించాలి
ఇప్పటికే ఇతర విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో గురుకుల విద్యార్థులకు బోధన, అభ్యసనంపై మరింత దృష్టి సారించాలని అధికారులు, బోధనా సిబ్బందికి సొసైటీ కార్యదర్శులు సూచనలిచ్చారు. ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌ పరీక్షలు సమీపించడంతో, ఇంటర్‌తోపాటు ఇతర తరగతుల విద్యార్థుల బోధనపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. గురుకుల విద్యా సంస్థల్లో ఇప్పటికే కోవిడ్‌–19 నిబంధనలకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, «థర్మల్‌ స్క్రీనింగ్‌ మిషన్లు, శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచామని, పిల్లలకు డైట్‌ మెనూ సరుకులు సైతం సిద్ధంగా ఉంచినట్లు ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి మల్లయ్యబట్టు ‘సాక్షి’కి తెలిపారు. 

జాగ్రత్తలు తప్పనిసరి... 
గురుకుల విద్యా సంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలి. 
విద్యాసంస్థకు వచ్చే పిల్లలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించాలి. అనంతరం మాస్కు, శానిటైజర్‌ అందించడంతో పాటు కోవిడ్‌–19 నిబంధనల పాటించడంపై అవగాహన కల్పించాలి.   
పాఠశాల, కళాశాల ఆవరణను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయాలి. 
విద్యార్థులకు జలుబు, జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే వారిని ఐసోలేట్‌ చేసి కోవిడ్‌–19 పరీక్ష నిర్వహించి నిర్ధారించుకోవాలి. అనంతరం తగిన చికిత్స అందించాలి. 

 ప్రతి విద్యా సంస్థలో ఐసోలేషన్‌ గదులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ప్రతి విద్యాసంస్థలో వైద్య సహాయకులు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. 

 ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లేటప్పుడు వెంట తీసుకెళ్లిన ప్లేటు, గ్లాసు, పెట్టె తిరిగి వెంట తెచ్చుకోవాలి. 
బోధనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జూమ్, ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థికి కలిగిన పరిజ్ఞానాన్ని అంచనా వేసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలి. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.  

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top