ఏకగ్రీవానికి ఒప్పుకుంటే డబ్బిస్తాం
సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం
చేయడానికి కూటమి నేతల ఒత్తిళ్లు
ఎన్నికలకు వెళితే ఇద్దరూ
నష్టపోతామంటూ బుకాయింపు
సర్పంచ్ అభ్యర్థి బంధువులు, స్నేహితుల ద్వారా పైరవీలు
బరిలో నిలబడి తీరుతామంటున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
నేడు పరిశీలన.. రేపు ఉప సంహరణ .. జోరుగా చర్చలు
జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు కొందరు ఏకగ్రీవాల కోసం.. మరికొందరు ఓట్ల వేటలో పడ్డారు. అధికార పార్టీ నేతలు మాత్రం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకుని ఏకగ్రీవానికి ఒప్పుకోవాలని హుకుం జారీచేస్తున్నారు. లేకపోతే నామినేషన్ పత్రాలు చించివేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఇంకొందరు.. నామినేషన్ ఉపసంహరించుకుంటే డబ్బులిస్తామని ఒత్తిళ్లు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో కీలకమైన సర్పంచ్ పదవుల కోసం సామదాన దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు మాత్రం అధిరపార్టీ నేతల బెదిరింపులకు భయపడకుండా.. డబ్బులకు లొంగకుండా సర్పంచ్‌గా పోటీచేసి తీరుతామని తెగేసి చెబుతున్నారు.
సాక్షిప్రతినిధి, తిరుపతి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి అధికారపార్టీ నేతలు ఓటమి భయంతో దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోతున్నారు. అధికారయంత్రాంగం సహకారంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కూటమి నేతలు చేస్తున్న వికృత చేష్టలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఫ్యాన్ జోరు.. కూటమి బేజారు
మున్సిపల్.. పరిషత్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలు, పోలింగ్.. ఆ తరువాత కౌంటింగ్ వరకు అధికార పార్టీ నేతలు ఓటమి భయంతో అనేక అక్ర మాలకు పాల్పడ్డారు. అయినా జనం వైఎస్సార్‌సీపీ వెంటే నిలబడ్డారు. అందుకు పరిషత్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అధికార పార్టీ నేతలు ఎన్ని దాడు లు, దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురొడ్డి పోరాడి ప్రజల పక్షాన నిలిచారు. అందుకు జనం కూడా వైఎస్సార్‌సీపీకి మంచి ఫలితాలను అందించారు. పరిషత్ ఎన్నికల ఫలితాలు కూటమిని మరింత కుంగదీస్తోంది. అందుకే సర్పంచ్ పదవులను కై వశం చేసుకునేందుకు రూ.కోట్లు కుమ్మరించడానికై నా వెనుకాడడం లేదు. క్షేత్ర స్థాయిలో కొందరు అధికార పార్టీ నేతలు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సర్పంచ్ పదవుల ను కొనుగోలు చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యేలకు ముడుపులు సమర్పించి బరిలో నిలబడుతున్నారు.
ఏకగ్రీవానికి ఒప్పుకో.. లేదంటే..!
పంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం అయ్యేందుకు ఒప్పుకోవాలని వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగుతున్నారు. ఒప్పుకోకపోతే.. నామినేషన్ పత్రాలు చించివేస్తామంటూ హెచ్చరికలు జారీచేస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు మాత్రం దేనికీ లొంగకపోవడంతో కూటమి శ్రేణుల్లో భయం పుట్టుకుంది. నామినేషన్లు చించివేస్తే గ్రామాల్లో తిరగలేమనే భయంతో కూటమి నేతలు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల బంధువులు, స్నేహితుల ద్వారా మంతనాలు నెరుపుతున్నారు.
కూటమిలో రెబల్స్ బెడద
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవుల కోసం కూటమి నేతలు ఎవరికి వారు పోటీపడుతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎవరికి వారు నామినేషన్లు వేశారు. ప్రతి పంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యత్వం కోసం ఇద్దరు, ముగ్గురు లేదా నలుగురు చొప్పున నామినేషన్లు వేశారు. నామినేషన్లు వేసిన కూటమి శ్రేణులు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల వద్దకు వెళ్లి ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంతైనా ఖర్చుచేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. అందులో భాగంగా అనేక మంది కూటమి శ్రేణులు సర్పంచ్ పదవి కోసం నాయకులకు ముడుపులు సమర్పించుకున్నారు. డిమాండ్‌ను బట్టి నాయకులు.. సర్పంచ్ అభ్యర్థుల నుంచి భారీగా ముడుపులు పుచ్చుకుని ఇద్దరు, ముగ్గురు మధ్య పోటీపెట్టేందుకు వెనుకాడటం లేదని ప్రచారం జరుగుతోంది.
లేకుంటే నామినేషన్ పత్రాలు చించివేస్తాం
శ్రీకాళహస్తి మున్సిపాలిటీలోనూ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ విడతలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని టీడీపీ, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగారు. తాము చెప్పిన మాట వినాలని, అనవసరంగా శతృత్వం పెంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్న వారిపైనా కూటమి నేతలు బెదిరింపులకు దిగారు. ప్రచారం చేయడానికి వీల్లేదంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, మద్దతుదారులు మాత్రం ‘మీ బెదిరింపులకు బెదిరేది లేదు’ అని గట్టిగా సమాధానం ఇస్తుండడంతో కూటమి నేతలకు మింగుడుపడడం లేదు.


