తిరుపతి అర్బన్: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉంది. నామినేషన్లు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 373 పంచాయతీలు, 3,526 వార్డులకు ఈ నెల 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. చిట్టమూరు, వాకాడు, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు, సూళ్లూరుపేట, తడ, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, రామచంద్రాపురం, తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం, పుత్తూరు, వడమాలపేట మండలాల్లో బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.


