పంచాయతీ సందడి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ సందడి

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

జిల్లాలో రెండు విడతల్లో

777 పంచాయతీలకు ఎన్నికలు

ఈ నెల 15 నుంచి తొలి విడత నామినేషన్లు

తిరుపతి అర్బన్‌: జిల్లా వ్యాప్తంగా 35 మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో శుక్రవారం తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. జిల్లాలో 807 పంచాయతీలు ఉండగా.. 30 పంచాయతీల్లో కోర్టు కేసులు నడుస్తున్న నేపథ్యంలో 777 పంచామతీలకు, 7,210 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడత నామినేషన్లు ఈ నెల 17 వరకు స్వీకరించనున్నారు. అనంతరం 26న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రెండో విడత నామినేషన్ల స్వీకరణ 20 వరకు సాగనుంది. 29న ఎన్నికలు చేపట్టనున్నారు. ముందుగా నిర్ణయించినట్లు మండలాల వారీగా కాకుండా నియోజకవర్గాల వారీగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఏకగ్రీవాల వైపు కూటమి ఎమ్మెల్యేల చూపు

జిల్లా వ్యాప్తంగా కీలకమైన పంచాయితీల్లో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేయడానికి స్థానిక ఎమ్మెల్యేలు ప్రణాళిక రచిస్తున్నారు. తమ అనుచరులు పంచాయతీకి పెద్ద మొత్తంలో (రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలు) ఇస్తారని, ఆ నిధులతో పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని పంచాయితీలు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా పరిశ్రమలు ఉన్న పంచాయతీల్లో తమ అనుచరులు సర్పంచ్‌గా ఉంటే వ్యాపారాలు చేసుకోవడంతోపాటు పెద్ద ఎత్తున లబ్ధిపొందవచ్చని భావిస్తున్నారు. కనీస ఆదాయాలు వచ్చే పంచాయతీలపై ఫోకస్‌ పెడుతున్నారు.

సచివాలయాలే అభివృద్ధి సూచికలు

గాంధీజీ కన్న కలలను గత వైఎస్సార్‌సీపీ నిజం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ సచివాలయాలను తీసుకొచ్చారు. ఇంటి ముందే అన్ని సేవలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 692 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ఒక్కో సచివాలయంలో 11 మంది ఉద్యోగులను నియమించారు. దీంతో జిల్లాలో 5,687 మందికి సచివాలయ ఉద్యోగాలు లభించాయి. ఏ గ్రామంలోకి వెళ్లినా సచివాలయం ముందుగా దర్శనమిస్తోంది. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌, డిజిటల్‌ గ్రంథాలయాలతోనే గ్రామీణ ప్రాంతాల్లో సకల సౌకర్యాలు కల్పించారు.

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణ గ్రామ, వార్డు అంటూ పేర్లు మార్పు చేయడంతోపాటు 50 శాతం సచివాలయాలను కుదింపు చేశారు. ఉద్యోగులను 50శాతం తగ్గించారు. ఇప్పటికీ చాలామంది ఉద్యోగులకు సరైన ఉద్యోగం ఇవ్వలేదు. సచివాలయ ఉద్యోగులను కార్యాలయంలో కాకుండా నిత్యం పదుల సంఖ్యలో సర్వే బాధ్యతలు అప్పగించారు. మరోవైపు వలంటీర్‌ వ్యవస్థను రద్దు చేశారు. సేవల సంఖ్యను తగ్గించారు. మళ్లీ పాత పద్ధతిలోకి తీసుకొచ్చారు.

నేడు విడుదల కానున్న నోటిఫికేషన్‌

సర్పంచ్‌ ఎన్నికల్లో మార్పులు

సర్పంచ్‌ ఎన్నికల్లో మార్పులు చేపట్టనున్నారు. రెండు విడతల్లో (ఈనెల 26, 29)ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ మండలాల వారీగా కాకుండా నియోజకవర్గాల వారీగా ఎన్నికలు జరపనున్నారు. ఇటీవల అధికారులు తొలి విడతలో(26న) 18 మండలాల్లోని 415 సర్పంచ్‌ స్థానాలకు, రెండో విడతలో (29న) 17 మండలాల్లో 362 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు చేపట్టాలని భావింతారు. తాజాగా మండలాల వారీగా కాకుండా నియోజకవర్గాల వారీగా రెండు విడతల్లోనే ఎన్నికలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జిల్లాలో చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు పూర్తిగా జిల్లాలో ఉన్నాయి. అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో (3 మండలాలు), గూడూరులో ( రెండు మండలాలు), నగరిలో (రెండు మండలాలు) పాక్షిక్షంగా ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో తిరుపతి కాకుండా 8 నియోజవర్గాల్లో ఎన్నికలు చేపట్టాల్సి ఉంది. మొదటి విడతలో 4 నియోజకవర్గాలు, రెండో విడతలో 4 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై డీపీవో సుశీలాదేవిని వివరణ కోరగా నియోజకవర్గాల వారీగా ఎన్నికలు ఉంటాయని, వివరాలను ఎన్నికల కమిషన్‌కు పంపించినట్లు చెప్పారు. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement