రాపూరు: నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, బండేపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల కథనం.. బండేపల్లికి చెందిన బోమ్మనుపోయిన గంగయ్య(62), వామిటిపర్తి పిచ్చయ్య(60) కూలిపనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో తిరుపతి నుంచి రాపూరు వైపు వస్తున్న కారు బండేపల్లి వద్ద వెనుక నుంచి ఇద్దర్నీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలై రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


