ఆ మూడు మండలాల్లో రీపోలింగ్‌ తప్పదా? | - | Sakshi
Sakshi News home page

ఆ మూడు మండలాల్లో రీపోలింగ్‌ తప్పదా?

Nov 13 2026 8:45 AM | Updated on Nov 13 2026 8:45 AM

● చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థులను వీడని రిగ్గింగ్‌ గుబులు ● వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థుల న్యాయ పోరాటంతో అప్రమత్తం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: చంద్రగిరి నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ ముగిసినా ఎన్నికల నిర్వహణపై చోటుచేసుకున్న వివాదాలు, పోలింగ్‌ రోజు జరిగిన అక్రమాలపై పోరాటం కొనసాగుతూనే ఉంది. ఆ మూడు మండలాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ వైఎస్సార్‌సీపీ న్యాయ పోరాటం చేస్తుండగా.. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులు ముందుగానే జిల్లా కోర్టులో కేవియట్‌లు దాఖలు చేస్తుండడం చర్చనీయాంశమైంది. అక్రమాలతో అడ్డగోలుగా గెలిచామన్న గుబులు వారిని వీడలేదని, అందుకే కేవియట్‌ పిటీషన్లతో తమ పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వైఎస్సార్సీపీ వర్గీయుల నుంచి వ్యక్తమవుతున్నాయి. చంద్రగిరి జెడ్పీటీసీగా ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి కొండేపాటి మధుమతి ఈ నెల 7న ఎలక్షన్‌ ట్రిబ్యూనల్‌, జిల్లా కోర్టులలో అందరికంటే ముందుగా కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి తనకు ఎన్నికల ధృవీకరణ పత్రం జారీచేసినట్లు అందులో పేర్కొన్న ఆమె ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కొటాల పద్మజ ఆ ఎన్నిక ఫలితాలను సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపారు. అలాంటి పిటిషన్‌ దాఖలు చేస్తే తనకు నోటీసులు ఇవ్వకుండా, తమ వాదనలు వినకుండా ఎలాంటి ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును ముందస్తుగా కోరారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అయిన కొటాల పద్మజ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని ముందుగానే కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేయడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియలో అనేక అక్రమాలకు పాల్పడి గెలిచామన్న గుబులు ఆమెను వెంటాడడం వల్లనే కేవియట్‌ పిటీషన్‌ దాఖలు చేసినట్టుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రీపోలింగ్‌పై ఉత్కంఠ

పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం మండలాల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. పోలింగ్‌ సందర్భంగా అక్రమాలు, అధికార పార్టీ నేతల రిగ్గింగ్‌, దొంగ ఓట్లకు పీఓలు, పోలీసుల అనుమతి తదితర అంశాలను ప్రధానంగా చేసుకుని ఆధారాలు సేకరించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలతో హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా మండలాల్లో రీపోలింగ్‌ జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఆ ప్రచారంతో ఒక విధంగా భయపడిన టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థులు ఆగమేఘాలపై కేవియట్‌ పిటీషన్‌లను కోర్టుల్లో దాఖలు చేస్తున్నారు. దీనిపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement