తిరుపతి ఎడ్యుకేషన్ : తమ ఖాతాదారులకు నాణ్యమైన, సురక్షితమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యమని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ పత్రి శ్రీనివాసకుమార్ తెలిపారు. యూనియన్ బ్యాంకు 108వ వ్యావస్థాపక దినోత్సవాన్ని బుధవారం సాయంత్రం తిరుపతిలోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తమ బ్యాంకు 10 వినియోగదారుల కేంద్రిత ఉత్పత్తులను ప్రారంభించిందని, త్వరలోనే దేశ వ్యాప్తంగా 108 కొత్త బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని తమ ఖాతాదారులకు మెరుగైన సేవలందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, రాస్ పీడీ నాగరాజు, యూనియన్ బ్యాంకు జోనల్ అస్సూరెన్స్ హెడ్ ఐకె.సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
నిందితుడిపై పోక్సో కేసు
బుచ్చినాయుడుకండ్రిగ: బిస్కెట్లు ఆశ జూపి, పదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు శ్రీకాళహస్తి డీఎస్పీ పావని తెలిపారు. ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌లో గురువారం నిందితుడు పోలయ్యను అరెస్టు చూపారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ వరదయ్యపాళెం మండలం, చెన్నవారిపాళెం దళితవాడకు చెందిన పోలయ్య(41) శ్రీసిటీలోని తో కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడని తెలిపారు. మంగళవారం పోలయ్య ఉబ్బలమడుగు జలపాతం సందర్శించి స్వగ్రామానికి వెళ్తుండగా కురింజలం గ్రామ పంచాయతీ సంతోష్ గిరిజన కాలనీ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పదేళ్ల బాలికను గమనించాడన్నారు. బాలికకు బిస్కెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి, నమ్మించి ద్విచక్ర వాహనంపై అపహరించాడని తెలిపారు. కుక్కంబాకం గ్రామ పరిధిలోని తెలుగుగంగ కాలువ రోడ్డు మార్గంలో ఉన్న మర్రిచెట్టు వైపు తీసుకెళ్లాడని, అక్కడ బాలిక గట్టిగా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కట్టెలు కొట్టుకుంటున్న వారు గమనించి ఘటనా స్థలానికి చేరుకోగా.. నిందితుడు పోలయ్య ద్విచక్ర వాహనాన్ని వదిలి పరారయ్యాడని తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. నిందితుడి కోసం గాలిస్తుండగా వరదయ్యపాళెం మండలంలోని కడూరు క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు పోలయ్యపై పోక్సో యాక్టుతోపాటు, రౌడీషీట్, పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆమె వెంట సీఐ లక్ష్మీనారయణ, ఎస్‌ఐ హరిప్రసాద్ తదితరులు ఉన్నారు.
సీపీఎస్ నుంచి ఓపీఎస్ మార్పునకు దరఖాస్తు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో లక్ష్మినారాయణ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ 2003 టీచర్లకు కల్పించిన ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు నోటిఫికేషన్ విడుదలై, ఆ తేదీ, ఆ తర్వాత విధుల్లో చేరిన టీచర్లు ఓపీఎస్‌కు అర్హులన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అర్హులైన టీచర్లు డిసెంబర్ 31వ తేదీలోపు నిధి పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు. ఇందుకు ప్రారంభ నియామక అధికారి వద్ద అనెక్సర్–2ఏ నమూనాలో దరఖాస్తు చేసి డీఎస్సీ–2003 నియామక ప్రకటన, ఎంపిక జాబితా, నియామకపు ఉత్తర్వులు, విధుల్లో చేరేందుకు అనుమతించిన ఉత్తర్వులను (సర్టిఫైడ్ కాపీలు) పొందాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు అందిన 15 పనిదినాల్లో అధికారులు ధృవీకృతకాపీలను అందజేస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని టీచర్లు తమ సందేహాల నివృత్తి, ధృవీకరణ దరఖాస్తుల సమర్పణకు డీఈవో కార్యాలయంలో సిబ్బందిని నియమించామని తెలిపారు.


