తొట్టంబేడులో మోటారు దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తొట్టంబేడులో మోటారు దొంగల ముఠా అరెస్ట్‌

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్‌): వ్యవసాయ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను తొట్టంబేడు పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.4.4 లక్షల విలువ గల 22 వ్యవసాయ మోటార్లు, 25 కేజీల రాగి వైరు, దొంగతనాలకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇటీవల తొట్టంబేడు, శ్రీకాళహస్తి రూరల్‌, బీఎన్‌ కండ్రిగ తదితర ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్ల దొంగతనాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు రావడంతో శ్రీకాళహస్తి డీఎస్పీ పావని పర్యవేక్షణలో, బీఎన్‌కండ్రిక సీఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో తొట్టంబేడు ఎస్సై బాలక్రిష్ణ తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తొట్టంబేడు మండలం, కొండచుట్టు దారిలో లక్ష్మీపురం దేవుడు మండపం సమీపంలో అనుమానాస్పదంగా ఆటోలో వ్యవసాయ మోటార్లను లోడ్‌ చేస్తున్నట్టు తెలుసుకుని ఎస్సై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుంచి 22 మోటార్లు, 25 కేజీల రాగి వైరు, ఆటో, కేబుల్‌ కట్టర్‌, కటింగ్‌ బ్లేడ్‌ స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు జయంపు ఈశ్వర్‌ (21), దేవరకొండ అజిత్‌ (22)గా గుర్తించారు. వీరు మరో ఇద్దరు వ్యక్తులైన విశాల్‌, శివతో కలసి రాత్రి సమయాల్లో వ్యవసాయ పొలాల్లోని మోటార్లను తొలగించి, వాటిలోని రాగి వైర్లు, ఇనుమును వేరుచేసి గుజిరి దుకాణాల్లో విక్రయిస్తున్నట్టు తేలిందన్నారు. అక్కూర్తి, చెర్లోపల్లి, తొండమనాడు, వెంకటాపురం, సుబ్బానాయుడుకండ్రిగ, కొత్తకాల్వ, కమ్మకొత్తూరు, కాసరం, పల్లమాలకండ్రిగ, కత్తివారికండ్రిగ తదితర ప్రాంతాల్లో మోటార్ల దొంగతనాలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు తొట్టంబేడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏఎస్‌ఐ రఘు, హెచ్‌సీలు శ్రీహరి నాయుడు, రఘునాథ్‌, కానిస్టేబుళ్లు ప్రభాకర్‌, నాగభూషణం, భక్తవత్సలం, కన్నయ్య, శ్రీను, రఘు ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement