చంద్రగిరి: క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యే తమ ప్రధాన ధ్యేయమని, క్యాంపస్‌లో అడుగుపెట్టిన ప్రతి విద్యార్థి తన బిడ్డతో సమానమని ప్రముఖ విద్యావేత్త, మోహన్ బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ మంచు మోహన్‌బాబు తెలిపారు. గురువారం యూనివర్సిటీ ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విద్యాసంవత్సరంలో నూతనంగా చేరిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుద్దేశించి ప్రసంగించారు. కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా, విలువలతో కూడిన విద్యనందిస్తూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలనుకునే విద్యార్థులకు సంస్థ తరఫున పూర్తిగా ఉచిత శిక్షణ అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.వి.రమణ, రిజిస్ట్రార్ సారథి, ఫైనాన్స్ ఆఫీసర్ రవిశంకర్, వివిధ విభాగాల డీన్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.


