– దేవదాయ శాఖ ప్రొసీడింగ్స్ రద్దు చేసిన హైకోర్టు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతిలో హధీరాంజీ మఠానికి చెందిన 2.7 ఎకరాలను అధికార పార్టీ నేతలు లీజు పేరుతో చెరబట్టేందుకు చేసిన కుట్ర విఫలమైంది. నగరంలోని మంచినీళ్లగుంట సమీపంలోని ఈ భూమిని లీజుకు ఇస్తూ అధికార పార్టీ నేతగా చెలామణి అవుతున్న మదన్‌మోహన్‌కు దేవదాఖశాఖ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు గురువారం సస్పెండ్ చేసింది. తిరుపతి నగరం, ఇతర ప్రాంతాల్లో హధీరాంజీ మఠా నికి ఉన్న భూములు అనేకం అధికార పార్టీ పేరుతో చలామణి అవుతున్న బడా నాయకుల స్వాధీనంలో చిక్కుకున్నాయి. వారి చెర నుంచి విముక్తి కల్పించడానికి మఠం అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నిబంధనల్లోని లొసుగుల ఆధారం చేసుకొని కొందరు రూ.కోట్ల విలువైన మఠం ఆస్తులను చేజిక్కించునేందుకు చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్నీ కావు. మరికొందరు అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దేవదాయశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి లీజు పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కోవలోనే మంచినీళ్ల గుంటకు సమీపంలోని భూమిని మదన్‌మోహన్ చేజిక్కించుకొనే ప్రయత్నం చేశారు. పట్టణ సర్వే నం.942ఏలోని 2.7 ఎకరాల మఠం భూమిని లీజు పేరుతో తీసుకొనేందుకు ప్రయత్నించారు. ఆయనకు ఈ భూమిని లీజుకు ఇస్తూ దేవదాయ శాఖ కమిషనర్ గత ఏడాది ఉత్తర్వులిచ్చారు. అయితే అసలు లీజుదారు తమ ఎడ్యుకేషనల్ సొసైటీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి మదన్‌మోహన్‌కు ఏవిధంగా లీజుకు ఇచ్చారంటూ హైకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.


