తిరుపతి మంగళం : తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గూండాలు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలను అడ్డుకుని వారి దాడుల్లో గాయపడిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపైనే అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని, కూటమి కక్ష సాధింపులు, అక్రమ కేసులకు భయపడే వారెవ్వరూ వైఎస్సార్‌సీపీలో లేరని వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి నియోజకవర్గ సమన్వకర్త భూమన అభినయ్‌రెడ్డి హెచ్చరించారు. తిరుపతి ఎంఆర్‌పల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు అనీల్, బ్రహ్మనందరెడ్డి, డిష్‌చంద్ర, జీవన్, చరణ్, తరుణ్, వెంకటరమణపై అక్రమ కేసులు బనాయించి గురువారం పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ సందర్భంగా తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో అరాచకాలతో మేయర్, కార్పొరేటర్లను గెలిపించుకున్నప్పటికీ వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి నోటీ సులు జారీ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో రెడ్‌బుక్‌పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, రాబోయేది జగనన్న పాలన అని.. అప్పుడు అంతకంత మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.


