యూరియా ధరలను ప్రతి సీజన్‌లో ఎప్పుడూ పెంచలేదు. అయితే చంద్రబాబు పాలనలో రెండేళ్లుగా ప్రతి సీజన్‌లో రేటు పెంచేస్తున్నారు. మా డబ్బులతో యూరియా కొనుగోలు చేస్తాం.. అవసరాల మేరకు సరఫార చేయడం అంటే అదీ లేకుండా పోయింది. ఒక బస్తా యూరియా తెచ్చుకోవడానికి నానా తిప్పలు పడుతున్నాం. చివరికు చైన్నె నుంచి యూరియా తెచ్చుకుంటున్నాం. ఇక్కడ యూరియా బస్తా రూ.280 ఉంటే.. తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్న యూరియా బస్తా రవాణా చార్జీలతో కలిపి రూ.400 పడుతోంది. – అగ్రహారం హరిబాబు రెడ్డి,
రైతు, పాతపాళెం, కేవీబీపురం మండలం
కందిపప్పుకు కటకట
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు చౌకదుకాణాల్లో కనీసం కందిపప్పుకు కూడా కటకటలాడాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో చౌకదుకాణాలను సూపర్ మార్కెట్లుగా తయారు చేస్తామని ఊదరగొట్టి.. ఇప్పుడు కేవలం బియ్యంతో సరిపెట్టేస్తున్నారు. అదీ గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా ఇవ్వడం లేదు. దీంతో పేదలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బియ్యంతోపాటు చక్కెర, నూనె, కందిపప్పు, రాగులు, రాగి పిండి తదితర వస్తువులు ఇచ్చేవారు.
– మునికృష్ణయ్య, రైతు, మెట్టు, చిట్టమూరు మండలం
రాయితీ మాటే లేదు
ప్రతి ఏటా రైతులకు రాయితీ పనిముట్లు ఇచ్చేవారు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలను సైతం అందించేవారు. అయితే చంద్రబాబు పాలనలో రాయితీ పనిముట్ల మాటే లేకుండా పోయింది. మరోవైపు ఎస్సీలకు, బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పారు. మా నుంచి దరఖాస్తులు స్వీకరించి ఏడాది గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. పాడి రైతులకు సబ్సిడీపై దాణా ఇవ్వడం లేదు. మత్స్య కారులకు పలు రాయితీలు ఉండేవి, అలాగే ఫిష్ ఆంధ్ర పేరుతో పలు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీలు అందేవి. ప్రస్తుతం అవన్నీ అటకెక్కేశాయి.
– బట్టా వెంకటేశ్వర్లు, రైతు, వాకాడు మండలం


