నేడే పరిషత్‌ పోరు | - | Sakshi
Sakshi News home page

నేడే పరిషత్‌ పోరు

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

జిల్లాలో 31 జెడ్పీటీసీ, 302 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు

బరిలో 958 మంది అభ్యర్థులు

1,505 పోలింగ్‌ కేంద్రాలు

11,70,397 మంది ఓటర్లు

సమస్యాత్మక కేంద్రాలు : 259

అత్యంత సమస్యాత్మకం : 494

ప్రాదేశిక సమాచారం

పరిషత్‌ మొత్తం ఏకగ్రీవాలు ఎన్నికలు అభ్యర్థుల

స్థానాలు జరిగేవి సంఖ్య

జెడ్పీటీసీ 35 4 31 126

ఎంపీటీసీ 444 142 302 832

సాక్షి, తిరుపతి : ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్‌ జరగనుంది. ప్రజా వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడుతుందనే భయంతో నోటిఫికేషన్‌ విడుదలైన రోజు నుంచే టీడీపీ నేతలు కుట్రలకు తెరదీశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయనీయకుండా దాడు లు, దౌర్జన్యాలతో అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యం బతికించాలనే సంకల్పంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ప్రచారం అడ్డుకోవడం, పోలింగ్‌ ఏజెంట్లను ఇబ్బందిపెట్టడం వంటి దుర్మార్గాలు చేస్తున్న నేపథ్యంలో కీలకమైన పోలింగ్‌రోజు టీడీపీ మరెన్ని అరాచకాలకు పాల్పడుతుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలింగ్‌ రోజైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రజలు స్వేచ్చగా ఓటు వేసుకునే వాతావరణం కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగియాలంటే పోలీసులు, ఎన్నికల అధికారుల పాత్రే కీలకం. వారిపైనే భారమంతా ఉన్న నేపథ్యంలో అధికారపార్టీ ఒత్తిడికి తలొగ్గకుండా పనిచేయాల్సిన అవసరముంది. ముఖ్యంగా రైల్వే కోడూరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో భారీగా దాడులు, పోలింగ్‌ ప్రక్రియలో దౌర్జన్యాలకు అధికారపార్టీ నేతలు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది.

ప్రత్యేక వాహనాల ద్వారా ...

పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది, సామగ్రిని తరలించడానికి ప్రత్యేకంగా 326 వాహనాలను ఏర్పాటు చేశారు. మంగళవారమే స్టేజ్‌–1 అధికారులు తమ కేంద్రానికి అవసరమైన ఎన్నికల సామగ్రిని తీసుకున్నారు. పోలింగ్‌, కౌటింగ్‌కు అవసరమైన సామగ్రిని జాబితా ప్రకారం అందజేశారు. ఈ నెల 7వ తేదీన జరగనున్న పరిషత్‌ కౌంటింగ్‌కు 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 373 కౌంటింగ్‌ టేబుళ్ల మీద చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో 373 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు,746 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌

గురువారం ఉదయం 7 గంటలకే పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 11,70,397 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ప్రక్రియలో అవాంతరాలతో రీపోలింగ్‌ జరపాల్సిన స్థానాలకు ఈ నెల 6వ తేదీన రీపోలింగ్‌ చేపట్టనున్నారు. ఈ క్రమంలో పరిషత్‌ పోరుకు జిల్లాలో 712 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 1,505 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 494 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు , 259 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు 35 మంది ఆర్‌ఓలు, 70 మంది ఏఆర్‌ఓలు, 1,806 మంది పీఓలు, 7,221 మంది పోలింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరందరికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహించారు. పోలింగ్‌ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,400 బాలెట్‌ బాక్సులను సిద్ధంగా ఉంచారు.

పోటీలో 958 మంది..

జిల్లాలో మొత్తం 35 జెడ్పీటీసీ స్థానాలకు గాను, శ్రీకాళహస్తి, ఏర్పేడు, నాయుడుపేట, ఓజిలి జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 31 జెడ్పీస్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. అందులో 126 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు జిల్లాలో మొత్తం 444 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, అందులో 142 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 302 ఎంపీటీసీ స్థానాలలో ఎన్నికల నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఈ స్థానాలలో మొత్తం 832 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement