చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని ఉత్తర్వులు సీసీ కెమెరా నిఘాలోనే జరపాలని సూచనలు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే న్యాయపోరాటం సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రకటన
తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసిందని వైఎస్సార్‌సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే ఎంతటి అధికారి అయినా సరే న్యాయపోరాటం చేసి ఎదుర్కొంటామని బుధవారం ఒక పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై తాను న్యాయపోరాటం చేయడంతో హైకోర్టు మంగళవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. ఆమేరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని స్పష్టం చేసినట్టు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ప్రక్రియ మొత్తాన్ని నిరంతరాయంగా వీడియో రికార్డింగ్ చేసి భద్రపరిచి న్యాయ స్థానానికి సమర్పించాలని సూచించినట్టు మోహిత్‌రెడ్డి వివరించారు.
ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించండి
చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలని చెవిరెడ్డి మోహిత్ ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఈ సందర్భగా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఏ స్థాయి అధికారైనా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే న్యాయం జరిగే వరకు ఎంతవరకై నా పోరాటం చేస్తానని హెచ్చరించారు.


