తిరుపతి మంగళం : పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు వేయాలని కోరారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన, గ్రామీణాభివృద్ధి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే సాధ్యమవుతుందని వెల్లడించారు. పల్లెవాసులకు మెరుగైన పాలన అందించేందుకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి కుతంత్రాలకు ఎదురొడ్డి ధైర్యంగా పోరాడి విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఓడిన వారు సైతం నిరాశ చెందకుండా, పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


