పెళ్లకూరు: కూటమి నాయకుల దుర్మార్గాలను నిలదీస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచే నామినేషన్ వేసి పెళ్లకూరు జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. దాంతో ఆయన భార్య కామిరెడ్డి ప్రభావతమ్మ, కుమార్తె కామిరెడ్డి రజిని స్థానిక నాయకులతో కలిసి గత మూడు రోజులుగా విస్త్రృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఒక పక్క వర్షం, మరో పక్క కామిరెడ్డి జైల్లో ఉన్నాడనే దిగులు... ఏదిఏమైనప్పటికీ అధైర్య పడకుండా గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న సత్యనారాయణరెడ్డితో పాటు పాలచ్చూరు, కలవకూరు ఎంపీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న పాలూరు రత్నమ్మ, బండి బాలచంద్రను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గడిచిన నలభైయేళ్లు రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వంలో నాయకులంతా రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిబంధనలను అమలు చేయాల్సిన పోలీసులు కూటమి రౌడీలకు వత్తాసుగా పలకడం అన్యాయమన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడొద్దని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు.


