అనేక కేంద్రాల్లో దొంగ ఓట్లు వేయించిన టీడీపీ గూండా జేబీ శ్రీనివాస్
పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను కూడా పీకేసిన టీడీపీ గూండాలు
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : తిరుపతి నగరంలో పదవుల కోసం టీడీపీ గూండా జేబీ.శ్రీనివాస్ చేస్తున్న అరాచకాలతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని కర్నూలు, నంద్యాల జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కో– ఆర్డినేటర్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి తిరుపతి పవిత్ర నగరంలో మేయర్‌పదవి దక్కించుకోవడం, కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం జేబీ.శ్రీనివాస్ చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దాడులు లెక్కేలేవన్నారు. నామినేషన్ల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పత్రాలను చింపేసి తమ పార్టీ అభ్యర్థులను ఏ విధంగా కొట్టి గాయపరిచారో అందరికీ తెలుసన్నారు. అయితే తిరుపతి నగరంలో ఆదివారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న దురాలోచనతో తిరుపతిలో మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూండా జేబీ శ్రీనివాస్ అతని రాచకశక్తులు, బూతులన్నీ ఆక్రమించి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి గెలవలేమన్న భయంతో నగరంలోని అనేక పోలింగ్ బూతులను ఆక్రమించి దొంగ ఓట్లు వేసుకున్నారన్నారు.
రీపోలింగ్ చేపట్టాలి
నగరంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిగా టీడీపీ గూండాల ఆధీనంలోకి తీసుకుని ఇష్టమొచ్చినట్లు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. రిగ్గింగ్, వెబ్ కెమెరాల తొలగింపు, పోలింగ్ కేంద్రాల్లో జరిగిన దౌర్జన్యాల నేపథ్యంలో ప్రభావితమైన వార్డుల్లో ఎన్నికలను రద్దుచేసి, పూర్తి భద్రత, పారదర్శకతతో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
పోలింగ్ బూతుల్లో టీడీపీ అరాచకశక్తులు రిగ్గింగ్
సీసీ కెమెరాలు పీకేశారు
ముఖ్యంగా 2. 6, 13, 20, 42, 45, 53, 57, 59, 63వ వార్డుల్లో విపరీతంగా రిగ్గింగ్‌కు పాల్ప డినట్లు భూమన తెలిపారు. దాంతో పాటు 16వ వార్డులో వెబ్ కెమెరాలను పీకి పడేసిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఎల్‌బీనగర్, అమరావతి నగర్ ప్రాంతాల్లో కూడా వెబ్ కెమెరాలను తొలగించినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న పోలింగ్ అధికారులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, వారిపై దాడికి ప్రయత్నిస్తూ భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల ఏజెంట్లను, అభ్యర్థులను సైతం బలవంతంగా లాగిపడేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని మండిపడ్డారు. లోకేష్ అనుచరుడిగా చెప్పుకుంటున్న మేయర్ అభ్యర్థి జేబీ.శ్రీనివాస్ వ్యవహారశైలితో తిరుపతిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. తిరుపతిలో రక్తపాతం సృష్టించే పరిస్థితులు తీసుకురావద్దని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి చర్యలను తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు.


